Vedire Sriram: కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ హయంలో ఎక్కువ నీటిని ఏపీ తరలించుకుపోయిందని కేంద్ర జలశక్తి సంఘం మాజీ సభ్యుడు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్ (Vedire Sriram) తెలిపారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుతో కాంగ్రెస్(Congress) కంటే బీఆర్ఎస్ (BRS) తెలంగాణకు ఎక్కువ అన్యాయం చేసిందని విమర్శించారు. మంగళవారం ఆయన నాంపల్లి బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను నిర్వహించారు. అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ, 2015లో ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణానది జలాల ఒప్పందం కుదిరిందన్నారు. 299 టీఎంసీలకే గత ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకుందని, అయితే అది ఆ ఏడాదికి మాత్రమే ఒప్పందం చేసుకున్నామని బీఆర్ఎస్ చెబుతున్నదన్నారు. కానీ, ఇదంతా పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు.
56 ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం
811 టీఎంసీల నీటిని అడగాల్సి ఉండగా బీఆర్ఎస్ 299 టీఎంసీలకు ఎలా ఒప్పుకుందని ప్రశ్నించారు. 299 టీఎంసీల నీటిని మాత్రమే వాడాలని బచావత్ ట్రిబ్యునల్ ఎక్కడా చెప్పలేదన్నారు. గోల్డెన్ ఛాన్స్‌ను బీఆర్ఎస్ మిస్ చేసుకుందని ఎద్దేవా చేశారు. మొదటి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసీఆర్, చంద్రబాబు నాయుడు సంతకాలు చేశారని, 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కూడా 299 టీఎంసీలకే సంతకం చేశారని గుర్తుచేశారు. 56 ఏళ్లుగా తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని, 2014కు ముందు ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేసి వాటర్ అలోకేషన్‌ను ఇవ్వలేదని పీపీటీ ద్వారా వివరించారు. ఒక్క బీమాకు తప్ప మిగతా ఏ ప్రాజెక్టుకు వాటర్ అలోకేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ అన్యాయం చేసిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ఏడింటిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదన్నారు. డబ్బులు పెట్టామని చెబుతున్నారని, కానీ, వాటర్ అలోకేషన్ ఉందా? లేదా? అనే విషయాన్ని చెప్పారా? అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌లు పూర్తి కాకపోవడంతో ఒక్క ఏడాది కూడా 299 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకోలేదన్నారు.
Also Read: HYD Water Supply: బీ అలర్ట్.. 8, 9 తేదీల్లో ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
బీఆర్ఎస్ పోతిరెడ్డి పాడుతో అన్యాయం చేసింది
నీళ్ల ఆలోకేషన్ ట్రైబ్యునల్ చూస్తుంది తప్ప రివర్ బోర్డుకు సంబంధం ఉండదని వెదిరె శ్రీరామ్ వివరించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఫ్లడ్ వాటర్ ఎక్కువగా పెన్నా నదికి తరలించడం దారుణమన్నారు. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఇంకా ఎక్కువ అన్యాయం పోతిరెడ్డి పాడుతో చేసిందని వివరించారు. బచావత్ ట్రైబ్యునల్ ఒక్క చుక్క నీటిని శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి రాష్ట్రాలకు కేటాయించలేదన్నారు. ఏపీ 400 టీఎంసీల ప్రాజెక్ట్ నిర్మిస్తే బీఆర్ఎస్ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పెట్టిన ఐదో వంతు కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులకు పెట్టి ఉంటే మహబూబ్‌నగర్, నల్లగొండ సశ్యశ్యామలం అయ్యేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను నిలిపివేసింది బీఆర్ఎస్ కాదని, ఎన్జీటీ అని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ గొప్పల కోసం కొట్టుకోవద్దని హితవు పలికారు. ఇకపోతే కేంద్రం కేఆర్ఎంబీ బోర్డును అలోకేట్ చేసిందని, ప్రాజెక్టుల సేఫ్ గార్డ్ కోసమే కేఆర్ఎంబీ అని తెలిపారు. రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్న వాటిని పరిశీలించేందుకే కేఆర్ఎంబీ ఉందని, అంతే తప్పా నీటిని తరలించుకుపోయేందుకు కాదన్నారు. కొత్తగా వాటర్ అలోకేషన్ కోసం 2015లో బీఆర్ఎస్ వేసిన కేసును విత్ డ్రా చేసుకోలేదన్నారు. అక్టోబర్ 6, 2020లో కేసు విత్ డ్రాకు ఒప్పందం కుదిరితే లీగల్ ప్రాసెస్‌ను ఏడాది పాటు బీఆర్ఎస్ సాగదీసిందన్నారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో తెలంగాణకు అన్యాయం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది పోతిరెడ్డిపాడు ఆపాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లేఖ రాశారని, కానీ పోతిరెడ్డిపాడు వర్క్ ఆర్డర్ వచ్చే వరకు కేసీఆర్ మరింత డ్రాగ్ చేశారన్నారు. పాలమూరుకు ఎన్విరాన్‌మెంట్ క్లియరెన్స్, హైడ్రాలజీ క్లియరెన్స్ లేకుండా రూ.వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతున్నారన్నారు. అందుకే ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదన్నారు. మైనర్ ఇరిగేషన్ డేటా కరెక్ట్ ఇస్తే 45 టీఎంసీలకు అనుమతి లభిస్తుందన్నారు. ఇకపోతే గోదావరి నదిపై కాళేశ్వరం మొత్తం స్ట్రాటజికల్ డిజైన్ ఫెయిల్యూర్ అని వెదిరె శ్రీరామ్ తెలిపారు. 2014 నుంచి 2024 వరకు 400 టీఎంసీల ప్రాజెక్టుకు కేంద్రం క్లియర్ చేసిందని, ఇది కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత అని పేర్కొన్నారు. అయినా సరిగ్గా కట్టుకోలేని పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
Also Read: Vedire Sriram: కేసీఆర్ సంతకం తెలంగాణకు మరణశాసనం: వెదిరె శ్రీరామ్

