Kite Festival: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా, టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, డ్రోన్ షోలను నిర్వహిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సచివాలయంలో బుధవారం ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ..రాష్ట్ర టూరిజాన్ని ప్రమోట్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జనవరి 13 నుంచి 15 వరకు నిర్వహిస్తామని చెప్పారు. సెలబ్రేట్ ది స్కైపేరుతో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుగుతాయని, ఈ ఫెస్టివల్‌లో 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, అదేవిధంగా మన దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 55 నేషనల్ కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారని మంత్రి తెలిపారు.
ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్
అదే విధంగా కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్(Culture, Language, Indian Connections) సహకారంతో జరిగే మిఠాయిల ఉత్సవంలో ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి వచ్చి హైదరాబాద్(Hyderabad)లో స్థిరపడిన వారు తమ ఇళ్లలో తయారు చేసిన 1,200 రకాల రకాల మిఠాయిలను, తెలంగాణ పిండి వంటలను 60 స్టాళ్లలో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. 100 చేనేత, హస్తకళల స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తారన్నారు. వీక్షకులకు ఉచిత ప్రవేశం ఉంటుందని, అందరూ ఆహ్వానితులే అని ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు ప్రకటించారు. జనవరి 16 నుండి 18 వరకు హట్ ఏయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని, ఐరోపా దేశాలకు చెందిన ప్రతినిధులతో అంతర్జాతీయ స్థాయి బెలూన్లతో ప్రదర్శన ఉంటుందని. ఉదయం పూట హైదరాబాద్ శివార్లలో, సాయంత్రం వేళ పరేడ్ గ్రౌండ్స్‌లో “నైట్ గ్లో బెలూన్ షో ఉంటుందని వివరించారు. ఈ బెలూన్ లో విహరించే ఔత్సహికులు బుక్ మై షో లాంటి ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో బుకింగ్ చేసుకోవాలని సూచించారు.
Also Read: Ponguleti Srinivas Reddy: ఈ ఏడాది ఆ నెలలోనే భూభారతి పోర్టల్.. భూముల కొలతల్లో ఇక అక్రమాలకు చెక్!
డ్రోన్లతో గగనతలం
జనవరి 16 నుంచి 17 వరకు గచ్చిబౌలి స్టేడియంలో అత్యాధునిక డ్రోన్లతో మెగా షో సాగనుందని, ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వం నుండి ఆధునిక ఆవిష్కరణల వరకు సాగిన ప్రయాణాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఎల్ఈడీ లైట్లతో కూడిన రేస్‌కోర్స్, భారీ స్క్రీన్‌లపై పస్ట్ పర్సన్ వ్యూ వీడియో ఫీడ్స్, డ్రోన్లతో గగనతలంలో సాకర్ (పుట్ బాల్) ఆట, తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఇవన్ని సందర్శకులకు గొప్ప అనుభూతిని పంచనున్నాయని అన్నారు. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం హైడ్రా ఆద్వర్యంలో పునరుజ్జీవింపజేసిన బాగ్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంట, కూకట్ పల్లిలోని నల్ల చెరువు, మాదాపూర్ లోని తమ్మిడికుంట, రాజేంద్రనగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీ సమీపంలోని బమ్ రుకున్ ఉద్ దౌలా చెరువుల వద్ద పతంగుల పండగ నిర్వహిస్తామని చెప్పారు. గతంలో తెలంగాణ పర్యాటక రంగం నిర్లక్ష్యానికి గురైందని, పర్యాటక అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో నూతన పర్యాటక విధానాన్ని తీసుకువచ్చి, పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తున్నామన్నారు.
పండగను అంగరంగ వైభవంగా
ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేలా పెట్టుబడిదారులను ఆకర్శించేందుకు అనేక రాయితీలు కల్పిస్తున్నామని, పీపీపీ మోడల్ లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టూరిజం కాంక్లేవ్, గ్లోబల్ సమ్మిట్ ద్వారా ₹22,324 కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, దీని ద్వారా సుమారు 90,000 ఉద్యోగాల కల్పనే మా లక్ష్యమని స్పష్టం చేశారు. తెలంగాణ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకే మిస్ వరల్డ్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించి ప్రపంచానికి తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పామని, పూల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించడంతో పాటు రెండు గిన్నిస్ రికార్డులను సాధించామని ప్రకటించారు. పర్యాటక అభివద్ధి సంస్థ మెనేజింగ్ డెరెక్టర్ క్రాంతి వల్లూరి మాట్లాడుతూ… తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా హైదరాబాద్(Hyderabad) వేదికగా అంతర్జాతీయ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవాలకు పరేడ్ గ్రౌండ్ వచ్చే సందర్శకులు ప్రజా రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఊబర్(Uber), ర్యాపిడో(Rapido) సేవలను వినియోగించుకునే ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని తెలిపారు. ప్రాణాలకు హానికరమైన చైనా మంజాను ఉపయోగించకుండా కేవలం కాటన్ దారాన్ని వినియోగించి, పతంగులను ఎగురవేయాలని సూచించారు. ప్రజలందరూ సహకరించి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లిక్ కన్వీనర్ లిబి బెంజిమన్, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

