Ponguleti Srinivas Reddy: రెవెన్యూ, స్టాంప్స్, రిజిస్ట్రేషన్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగాలను భూ భారతి పోర్టల్‌లను ఒకే గొడుకు కిందకు తీసుకువస్తున్నామని మార్చి వరకు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy)తెలిపారు. దీని వలన ప్రజలకు మరింత మెరుగైన సేవలు, పారదర్శకంగా అందుతాయన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, దేవాదాయ, అటవీ, వక్ఫ్ భూములు తదితర అన్ని వివరాలు కనిపించేలా పోర్టల్‌లో పొందుపరిచామని తెలిపారు. నాంపల్లిలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్(ట్రెస్సా) 2026 డైరీని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రెవెన్యూ వ్యవస్థలో ఎదుర్కొన్న సమస్యల నుంచి విముక్తి లభిస్తుందనే నమ్మకంతో తెలంగాణ ప్రజానీకం ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. పదేళ్ల కాలంలో భ్రష్టు పట్టిన రెవెన్యూ వ్యవస్థను ఒక్కో మెట్టు పేర్చుకుంటూ గ్రామ స్ధాయి వరకు బలోపేతం చేశామన్నారు.
గడిచిన రెండేళ్లలో ఎన్నొ విప్లవాత్మకమైన నిర్ణయాలు
దశాబ్దాలుగా సాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు అనుగుణంగా గడిచిన రెండేళ్లలో ఎన్నొ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. తెలంగాణ రైతుల భూములకు సంబంధించి గుండెకాయ లాంటి సర్వే విభాగాన్ని పటిష్ట పరుస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 3,500 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను తీసుకోవడం జరిగిందన్నారు. వారం రోజుల్లో మరో 3,000 మందిని తీసుకోబోతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తమ ప్రభుత్వం అర్థం చేసుకున్నదని, ఆర్థిక ఇబ్బందుల వల్లే కొంత ఆలస్యం జరుగుతున్నదని చెప్పారు. వారికి అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రెస్సా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్, కోశాధికారి రమణా రెడ్డి, కల్చరల్ డైరెక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి, టీఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాస్, జగదీష్, ఆర్డీవో ఉపేందర్ రెడ్డి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Ponguleti Srinivas Reddy: భూభారతి పోర్టల్‌తో అనుసంధానం.. ఒక్క క్లిక్‌తో రైతులకు పూర్తి భూసమాచారం!
గత పాలకుల అశాస్త్రీయ విభజనను సరిదిద్దుతాం
రాష్ట్రంలో గత పాలకుల హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా లను పునర్వ్యవస్ధీకరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్ రెడ్డి, వీరేశం, పాల్యాయి హరీశ్ తదితరులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మండలాల ఏర్పాటు మొదలుకొని జిల్లాల పునర్వ్యవస్దీకరణ వరకు ఇష్టానురీతిలో మొక్కుబడిగా జరిగాయని, దీనివలన ఒకే నియోజకవర్గంలోని 4 మండలాలు 4 జిల్లాల్లో ఉండే పరిస్ధితి ఏర్పడిందన్నారు. అదేవిధంగా తమను పొగిడిన వారి కోసం ఒక విధంగా, పొగడని వారి కోసం మరో విధంగా, తమ అదృష్ట సంఖ్యను ఊహించుకొని అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త మండలాలు, డివిజన్ల ఆవశ్యకతను కూడా గుర్తించామని చెప్పారు.

