BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. పొత్తుతో పోతారని పార్టీ నేతలు సైతం భావించినప్పటికీ పార్టీ మాత్రం ఏ పార్టీతో సంప్రదింపులు జరుపలేదు. అర్బన్ లో సైతం పార్టీకి ప్రజల్లో బలం ఎంతో తెలుసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ ఫలితాలతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని గాడిలో పెట్టొచ్చని భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే ఏ పార్టీతో కాకుండా ఒంటరిగానే పోటీచేయాలని, పార్టీ నేతలకు సైతం అవకాశం కల్పించాలని భావించే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఒంటరిపోరుకు సిద్ధం
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పక్రియ ముగిసింది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఏ పార్టీతో పొత్తులతో సంప్రదింపులు జరుపలేదు. పొత్తులతో వెళ్తే పార్టీకి నష్టమని భావించే పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పొత్తు పెట్టుకుంటే మున్సిపాలిటీల్లో గానీ, కార్పొరేషన్లలో గానీ పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులకు న్యాయం చేయలేమని, వారికి ప్రియార్టీ ఇవ్వలేమని, దీంతో వ్యతిరేకత వార్డుల్లో వచ్చి పార్టీకి నష్టం జరుగుతుందని భావించే ఒంటరిపోరుకు సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఆశించినదానికంటే ఎక్కువగా 40శాతం గ్రామాల్లో విజయం సాధించడంతో గులాబీలో జోష్ నెలకొంది. అందుకే మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సీట్లు సాధిస్తామని ప్రభుత్వ వైఫల్యాలే తమకు కలిసి వస్తాయనే ధీమాతో పార్టీ ఉంది. ఆ దిశగా పావులు కదుపుతుంది. హామీలు, గ్యారెంటీల అమలులో జాప్యంపై పార్టీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు.
Also Read: BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాల్సిందే.. నేతల మాటలకు అధిష్టానం షాక్?
నేతలతో సాయంత్రం భేటీలు
ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్లలో ప్రజాభిప్రాయంతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే విజయం సాధిస్తారనే దానిపై సర్వేలు నిర్వహించింది. ఏ వార్డులోగానీ, డివిజన్ లో గానీ పార్టీ బలహీనంగా ఉంటే అక్కడ ఆర్థికంగా ఉన్న వ్యక్తులను ఎంపికచేసినట్లు పార్టీ మున్సిపల్ ఇన్ చార్జులు తెలిపారు. అంతేకాదు ఏ నియోజకవర్గం కింద మున్సిపాలిటీ వస్తుందో ఆ సంబంధిత స్థానిక ఎమ్మెల్యేగానీ, మాజీ ఎమ్మెల్యేగానీ అభిప్రాయాలు తీసుకొని మరోవైపు పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేశారు. వారు విజయం సాధించాలంటే అనుసరించాల్సిన విధానాలపై ముఖ్య నేతలతో సాయంత్రం భేటీలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ ఇచ్చే సూచనలు అందజేస్తున్నారు ఇన్ చార్జులు.
ప్రతి రోజూ ఆరా
తెలంగాణ భవన్ లో ఎన్నికల పర్యవేక్షణపై వార్ రూం ఏర్పాటు చేసి మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ను ఇన్ చార్జీగా నియమించినట్లు సమాచారం. ఆయనతో పాటు 15 మంది బృందం నిత్యం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రచారశైలీతో ప్రతి రోజూ ఆరా తీస్తున్నారు. నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయితే ఎక్కడైతే పార్టీ వీక్ గా ఉన్నట్లు తెలిస్తే అక్కడ అనుసరించాల్సిన విధివిధానాలు, ఓటర్లను ఆకట్టుకునే అంశాలు.. ఎన్నికల వరకు ఎవిధంగా వారిని కలువాలని తదితర అంశాలను వివరిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఫిబ్రవరి 3వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ కు చెందిన నాయకులు డివిజన్లలో ఇద్దరు నుంచి ముగ్గురు నామినేషన్లు వేసినట్లు సమాచారం. అయితే అక్కడ ఒక్కరే పోటీలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రెబల్స్ ఉంటే పార్టీకి నష్టమని భావించి వారు ఉపసంహరించుకునేలా చర్చలు జరుపుతున్నారు. అందరూ సమన్వయంతో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒకరికే బీపారాలు ఇచ్చి వారి గెలుపుకోసం పనిచేయాలని, రాబోయే కాలంలో పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, ఇప్పుడు పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తామని హామీలు సైతం ఇస్తున్నట్లు సమాచారం. అదే విధంగా మున్సిపల్ ఇన్ చార్జులు ప్రతిరోజూ మున్సిపాలిటీల్లో జరిగే ప్రచార సరళిపై పార్టీకి నివేదిస్తున్నారు.
Also Read: BRS Party: ఏబీఎన్ ఛానల్‌పై బీఆర్ఎస్ ఆంక్షలు.. పార్టీ ఆఫీసుల్లోకి నో ఎంట్రీ.. కారణం ఇదే

