Satyam Scam: సత్యం స్కాం.. 20 ఏండ్ల క్రితం దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. దీనిని ఇండియాస్ ఎన్రాన్ అని కూడా అంటారు. 2003 నుంచి అక్రమ సంపాదన మొదలు పెట్టినా, బినామీ పునాదులపై సంపద వెనకేసుకోవడం 2000లోనే ప్రారంభమైంది. అప్పట్లో ఉద్యోగులకు ఐదంకెల జీతాలు ఇచ్చిన సత్యం కంప్యూటర్ సర్వీస్ లిమిటెడ్ బంధువుల పేర్లతో బినామీ కంపెనీలు కూడా సృష్టించింది. వివాదాలు ఉన్నా, ఆనాడు పచ్చ నోట్లతో అధికారులకు కొట్టి ఇష్టానుసారంగా ప్రొసీడింగ్స్ ఇప్పించుకున్నారు. రిజిస్ట్రేషన్ అయితే చాలు ప్రభుత్వ భూములనైనా సరే ఎడాపెడా కొనుగోలు చేశారు. పట్టాదారులు ఎవరో తెలియకుండానే డబ్బులు ఉన్నాయని బ్రోకర్స్ చెప్పిందే నమ్మి తమ వశం చేసుకున్నారు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అంటకాగుతూ వందలాది ఎకరాలను ఆశగా చూపించి లాబీయింగ్ చేసుకుంటూ వచ్చారు.
అసలు కథ ఇప్పుడే మొదలైంది
సత్యం స్కాంలో నిందితులకు సీబీఐ కేసులో శిక్ష పడింది కానీ, మనీలాండరింగ్ కేసులో ఈడీ స్పెషల్ కోర్టులో ఇంకా విచారణ జరుగుతున్నది. ఎస్‌సీ 1 ఆఫ్ 2014లో అక్రమ సంపాదనతో కొనుగోలు చేసిన భూములు ఎక్కడ ఉన్నాయో ఎలా టైటిల్ లేకుండా డబ్బులతో మేనేజ్ చేశారో సాక్ష్యాలు ఇస్తామంటూ బాధితులు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. మొన్న ఏ 12 నందిని టైటిల్ లేకుండా భూమిని ఎలా కొనుగోలు చేశారో చెబుతానంటూ అభినవ్ ఈడీ స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే క్రమంలో ఆవుల అనిత కూడా కేటీఆర్ ఫాంహౌస్‌లో ఉన్న భూమి తనదే అంటూ మరో పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అయ్యారు. ఇలా జన్వాడలోని 96 ఎకరాల భూమికి మొదట్లో పట్టాదారులుగా ఉన్న శ్యాం లాల్, మదన్ లాల్‌లు, వాళ్లు అమ్మిన వారిని కాదని దొంగ ప్రొసీడింగ్స్ చేసుకున్న భూములు బయటకు వస్తున్నాయి. ఈ భూముల్లో కేటీఆర్ ఫాంహౌస్ ఉండడం ఇప్పుడు అందరినీ కలవర పెడుతున్నది. ప్రదీప్ రెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్, కేటీఆర్ భార్య శైలజ పేరు మీద ఉన్న భూమి మొత్తం, ఫాంహౌస్ ప్రహరీ గోడ అంతా చర్చనీయాంశంగా మారింది.
అనిత 6 ఎకరాల చరిత్ర ఇదే
ఆవుల అనిత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అయిన జస్టిస్ ఆవుల సాంబశివరావుకు దగ్గరి బంధువు అని చెబుతున్నారు. ఈమె జన్వాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 309/1 లో 3 ఎకరాలు, 309/2లో 1.15 గుంటలు, 309/3 లో 1.14 గుంటలు, 309/6 0.20 గుంటలను డాక్యుమెంట్ నెం.8795/1996 ద్వారా 1996 అక్టోబర్ 31న కొనుగోలు చేశారు. ఆ తర్వాత 1.20 గుంటలు అశోక బిల్డర్స్‌కు 2010లో విక్రయించారు. కానీ, 2018లో డీఆర్ బీఆర్ అగ్రో అండ్ శతభిష అగ్రో కంపెనీ వాళ్లు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారని 2018 ఆగస్ట్ 7న ఫిర్యాదు (ఎఫ్ఐఆర్ నెం.586/2018) చేస్తే కేసు నమోదైంది. ఇదే భూమిలో మాస్టర్ ప్లాన్ నుంచి భూమి పోతుందని అనితను తప్పుదారి పట్టించి 2021లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయించారు. రోడ్డు హెచ్ఎండీఏ ఇష్టం అంటూ న్యాయస్థానం కొట్టివేసింది. దాంతో అధికారులను తప్పుదారి పట్టించి కేటీఆర్‌కు ఫాంహౌస్ కావాలనే ఉద్దేశంతో అక్కడ టైటిల్‌పై వివాదం సృష్టించారు. సివిల్ కేసులో వివాదాలు ఉన్నాయని ఏ ప్రభుత్వం ఉన్నా మేనేజ్ చేసే కింగ్ పిన్‌లు 2024లో బాధితులపై కేసు (ఎఫ్ఐఆర్ నెం.103/2024) నమోదు చేయించారు. తేజ రాజ్ చెబితేనే ఫిర్యాదు చేశామని ‘స్వేచ్ఛ’తో ఫిర్యాదుదారుడు రుద్రరాజు సత్యనారాయణ రాజు తెలిపారు. దీనిపై ఛార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు 2018లో కేసును క్లోజ్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం మేనేజ్ చేస్తున్నాం అనే సంకేతాలు ఇస్తున్నారు స్కామర్ సత్యం రామలింగరాజు, ఆయన కుమారుడు తేజ రాజ్.
Also Read: Telangana Congress: ఉపాధి హామీ రక్షణే ధ్యేయంగా పర్యటనలు..పేదలకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ సమరశంఖం!
ఫేక్ ఇదే అంటున్న అనిత?
ఆవుల అనిత పట్టా దారులైన శ్యామ్ లాల్ కుటుంబం నుంచి 1996లో భూమిని కొనుగోలు చేశారు. కానీ, 2000 సంవత్సరం(బీ1/2450/2000) ఆగస్ట్ 10న అప్పటి శంకర్ పల్లి ఎమ్మార్వో అయిన వీ కామేశ్వరి సర్వే నెంబర్ 249 పైన ఇచ్చిన ఉత్తర్వులతో అనిత పేరు మీద ఉన్న 309 సర్వే నెంబర్స్‌లోని 5 ఎకరాలు, సత్యం కేసులో ఏ 14గా ఉన్న రాధ, ఏ 16గా ఉన్న రామరాజు, ఏ 154 అయిన శ్రావణా అగ్రో టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎవరు అమ్మారో తెలియని గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినట్లు చూపించారు. ఆ తర్వాత శతభిషాకు మారింది. ఇలా ఒక్క జన్వాడలోనే 96 ఎకరాలను ఇష్టానుసారంగా కొనుగోలు చేశారు. రాజేష్ మాటలు నమ్మి ప్రదీప్ భూములను కేటీఆర్ ఫాంహౌస్‌కు కొనుగోలు చేశారు.
111 జీవో రద్దుకు ఒత్తిడి?
జన్వాడ కోకాపేటకు కూత వేట దూరం. సత్యం రామలింగరాజు వారసులైన తేజ రాజ్ కేటీఆర్ కుటుంబాన్ని ఇరికించారు. అప్పటికే తేజ రాజ్ లాబీయింగ్‌తో భూములు కొనుగోలు చేశారు. అందుకే 111 జీవో రద్దుకు కూడా ఈ సత్యం కంప్యూటర్స్ వందల ఎకరాలకు లింక్ ఉన్నది. రాజేష్ తక్కువ ధరకు కొనుగోలు చేసి చూపించిన కేటీఆర్ అక్రమాస్తులు తోడవ్వడంతో 2022లో 111 జీవో రద్దు అంటూ కమిటీలు వేశారు.
మరిన్ని కథనాలు
ఏ కంపెనీ పేరుతో కొనుగోలు చేసినా బినామీలు ఫైట్ చేస్తే భూములు బదిలీ కావాలి. కానీ, ప్రభుత్వంలో ఎవరు ఉన్నా, మహేంద్ర టెక్ టేకోవర్ చేసుకున్నా, ఇంకా ఆ భూములు బినామీల పేర్లతో సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు కుటుంబం బిజినెస్ మైండ్‌తో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నది. అది తేజ రాజ్ తెలివితేటలు అని అందరూ అంటున్నారు. స్కాంతో సత్యం కంప్యూటర్స్ మటాష్ అయినా, వారి లాబీయింగ్‌తో ఎక్కడా నష్టం లేకుండా వ్యవహారాలు ఎలా నడిపిస్తున్నారో రాబోయే కథనంలో చూద్దాం.
Also Read: Eco Park Scam: ఎక్స్ పీరియం ఎకో పార్క్ యజమాని ఘరానా మోసం.. లీజు పేరుతో లాగేసుకున్న పేదల భూమి..?

