Telangana Congress: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉనికిని కాపాడుకోవడమే లక్ష్యంగా, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు తెలంగాణ కాంగ్రెస్ ( Congress) సమరశంఖం పూరించింది. ఏఐసీసీ పిలుపు మేరకు, ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పర్యటించనున్నారు. ఉపాధి హామీపై కేంద్రం కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం, ఈ పథకం నుంచి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ, క్షేత్రస్థాయిలో కూలీల పక్షాన నిలబడాలని నిర్ణయించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ఈ పథకాన్ని కాపాడుకోవడం తమ బాధ్యతని పార్టీ ప్రకటించింది.
నియోజక వర్గానికి ఓ సభ
ప్రతి నియోజకవర్గంలో ఒక గ్రామ సభను ఏర్పాటు చేసి, ఉపాధి హామీ కూలీల సమస్యలను స్వయంగా పీసీసీ చీఫ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లు తెలుసుకోనున్నారు. నేరుగా కూలీలతో మాట్లాడి, వారి ఇబ్బందులపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా కూలీలతో కలిసి నేతలు పంక్తి భోజనాలు చేయనున్నారు. తద్వారా సామాన్యులతో మమేకం కానున్నారు.
షెడ్యూల్ ఇలా
జనవరి 28 మెదక్ మానకొండూరు నియోజకవర్గంలో, 29న వేములవాడ ఎల్లారెడ్డిలో, 30న మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనంతో పాటు ఆలేరులో సభ నిర్వహించనున్నారు. జనవరి 31న నకిరేకల్, ఇబ్రహీంపట్నంలో సభలు పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ పర్యటన ద్వారా గ్రామీణ ఓటర్లలో చైతన్యం నింపాలని, కేంద్ర ప్రభుత్వ వివక్షను ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ‘ఉపాధి హామీ పథకం పేదల హక్కు. దానిని రద్దు చేసే ప్రయత్నాలను కాంగ్రెస్ సహించదు. ప్రతి గ్రామంలోనూ కూలీల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం’ అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
నేతల పనితీరుపై ‘రిపోర్ట్ కార్డ్’
పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని అధిష్ఠానం స్పష్టం చేసిన నేపథ్యంలో, మీనాక్షి నటరాజన్ నియోజకవర్గాల వారీగా పర్యటనల్లో క్షేత్రస్థాయి మానిటరింగ్ చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారనే అంశంపై రహస్య సర్వేలు నిర్వహించి రిపోర్ట్ తయారు చేయనున్నారు. పార్టీలో ఉన్న నేతలను మూడు వర్గాలుగా విభజించి, ఎవరి ప్రాధాన్యత ఎంత అన్న దానిపై క్లారిటీ ఇవ్వనున్నారు. మంత్రులు, స్థానిక నేతల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాదు, పదవుల భర్తీకి కసరత్తు చేయనున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత పదవుల కోసం ఆశావహుల జాబితాను మీనాక్షి నటరాజన్ స్వయంగా పరిశీలించనున్నారు. కేవలం పైరవీలకు తావులేకుండా, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండా మోసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు
రాబోయే మున్సిపల్ ఎన్నికల కోసం ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా మంత్రులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నేతలు ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది ఈ పర్యటనల్లో ప్రధానంగా గమనించాలని ప్లాన్ చేశారు. ఎక్కడైతే నేతల మధ్య అసమ్మతి ఉందో, అక్కడ తక్షణమే కౌన్సెలింగ్ ఇచ్చి పార్టీ లైన్ దాటకుండా హెచ్చరికలు జారీ చేయనున్నారు.
Also Read: Telangana Congress: కాంగ్రెస్ సాధించిన చారిత్రక విజయం.. కార్యకర్తలు నేతలు సంబురాలు

