Municipal Elections: ఎమ్మెల్యేలకు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ పెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ నెలకొన్న నేపథ్యంలో అభ్యర్ధుల విజయం కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోనే ఈ సమస్య అత్యధికంగా ఉన్నది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు చైర్మన్ల విజయానికి కృషి చేయాలని ఇన్ చార్ మంత్రులు ఆయా సెగ్మెంట్ల ఎమ్మెల్యేలు ఆదేశాలు ఇచ్చారు. దీంతో శాసన సభ్యుల్లో టెన్షన్ నెలకొన్నది. పైగా క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణలు, ప్రతిపక్షాల వ్యూహాలు అధికార పార్టీ శాసనసభ్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.పైగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. రెండేళ్ల పాలనపై ప్రజల తీర్పు ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇదొక ‘లిట్మస్ టెస్ట్’అని సర్కార్ భావిస్తోంది.ఈ ఫలితాలు అనుకూలంగా వస్తేనే.. మరో పదేళ్ల పాటు తిరుగులేని అధికారాన్ని కొనసాగించవచ్చని పార్టీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.అందుకే, అభ్యర్థుల గెలుపు బాధ్యతను పూర్తిగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల భుజస్కంధాలపైనే పెట్టింది.
గట్టి పోటీ హోరాహోరీ పోరు!
గతంలో లాగా ఏకపక్షంగా ఎన్నికలు జరిగే పరిస్థితి ఈసారి కనిపించడం లేదు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించుకోలేకపోతే ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతుందనే సంకేతాలు వెళ్తాయనే భయంతో శాసన సభ్యులు ఉన్నారు. దీంతోనే అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు ప్రతి అడుగులోనూ ప్రత్యర్థులు వ్యూహాలకు చెక్ పెట్టేందుకు ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఎలాగైనా పుంజుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్, అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ గ్రౌండ్ లెవల్‌లో బలమైన కేడర్‌ను మోహరిస్తోంది. దీంతో కాంగ్రెస్ కేడర్ చీలిపోకుండా సమన్వయ కమిటీలను ఎమ్మెల్యేలు అలర్ట్ చేశారు.
రెబల్స్ కు భరోసా
అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పుడు నిద్రలేకుండా పోతోంది. టిక్కెట్ల ఆశావహుల సంఖ్య పెరగడం,టికెట్ రాని వారు రెబల్స్‌గా మారే ప్రమాదం ఉండటంతో ముందుగానే అప్రమత్తమయ్యారు. రెబల్స్ కు భవిష్యత్ పదవులపై భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఫలితాలు తేడా కొడితే.. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే ముద్ర పడే అవకాశం ఉన్నట్లుపార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నాయి. మరోవకైపు ఈ ఎన్నికల్లో ఫలితాలే వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపునకు ప్రామాణికంగా మారతాయని అధిష్టానం హెచ్చరించడం కూడా ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతుంది.

