Tourism Department: టూరిజం శాఖలో (Tourism Department) ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కిందిస్థాయి సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఎవరికి తోచినంతవారు దోచేసుకుంటున్నారు. లెక్కల్లో మాత్రం ఆదాయం రావడం లేదని, నష్టాలు వస్తున్నాయి అని చూపుతున్నారు. లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు చూపుతో హరిత హోటల్స్‌ను దివాలా తీయిస్తున్నారు. లక్షల రూపాయలను సిబ్బంది కాజేస్తున్న నోటీసులతోనే సరిపుచ్చుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు, నష్టాలకు కారకులైన వారికే మళ్లీ పోస్టింగ్‌లు ఇస్తూ అందలం ఎక్కిస్తున్నారు. ఇది ఉన్నతాధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. ఫలితంగా పర్యాటక శాఖ మరింత నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నది.
రాష్ట్రానికి వచ్చే విదేశీ, స్వదేశీ పర్యాటకులకు వసతి సదుపాయం కల్పించేందుకు వందల కోట్లు ఖర్చు చేసి హరిత హోటళ్లను (Haritha Hotel) ప్రభుత్వం నిర్మించింది. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాల్లో 21 వరకు హరిత హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని టూరిజం శాఖ నిర్వహణ చేపట్టింది. అయితే, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంతో నష్టాల బాట పట్టాయని ఆరోపణలు ఉన్నాయి. వాటి నిర్వహణ నెలకు లక్షల్లో ఖర్చు అవుతుందని భావించిన ప్రభుత్వం, అందులో కొన్నింటిని టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది.
రూ.200 కోట్లపైగా బకాయిలు?
తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్‌టీడీసీఎల్) నిర్వీర్యమవుతున్నది. ఆర్థిక ప్రణాళిక లేకుండా కమీషన్ల కోసం ఇష్టారీతిన ఏర్పాటు చేసిన హరిత హోటళ్లు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయనే ఆరోపణలున్నాయి. లీజులు, సబ్ లీజుల కేటాయింపుల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయని సమాచారం. ఫలితంగా రూ.200 కోట్లకు పైగా బకాయిలు పేరుకు పోయినట్లు తెలిసింది. వాటిని వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. లీజుదారుల విషయంలో అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు నోటీసులందుకున్న లీజుదారులు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు.
Also Read: Tourism Scam: టూరిజం శాఖలో దర్జాగా టికెట్ దందా? ఉద్యోగుల చేతివాటం.. పట్టించుకోని అధికారులు..!
ఆదాయం పక్కదారి
టూరిజం శాఖకు రావలసిన ఆదాయాన్ని అందులో పని చేస్తున్న అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమందిపై ఫిర్యాదులు వచ్చినా, మరికొంతమందిపై విచారణలో వాస్తవం తేలినా చర్యలు చేపట్టడంలో జాప్యం జరుగుతున్నది. అంతేకాదు కొందరికి శాఖలోని ఉన్నతాధికారుల మద్దతు పుష్కలంగా ఉండడంతో ప్రభుత్వానికి రావలసిన ఆదాయాన్ని యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఆరోపణలు ఉన్న వ్యక్తులకే ప్రమోషన్ ఇస్తూ పెద్దపీట వేస్తున్నారు. నిధులు రికవరీ చేయకుండా వారికి బాధ్యతలు అప్పగిస్తుండడం ఉన్నతాధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. ఇలాగే ఉంటే భవిష్యత్తులో టూరిజం శాఖకు సంబంధించిన హరిత ప్లాజాలన్నీ వేలం పాట వేయాల్సిన పరిస్థితి వస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బేగంపేటలో ఏం జరిగిందంటే?
టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోని బేగంపేటలోని ది ప్లాజా హోటల్ కొనసాగుతున్నది. సీనియర్ సేల్స్ మేనేజర్ శామ్యూల్ ప్లాజాకు చెల్లించాల్సిన బకాయిలకు రూ.18,66,693 బాధ్యత వహించాల్సి ఉంటుందని, చెల్లించకపోతే 2025 ఆగస్ట్ నుంచి మీ వేతనం నుంచి ప్రతి నెలా రూ.15,000 ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ నోటీస్ ఇచ్చింది. అందుకు అతను సెప్టెంబర్‌లో రిప్లై ఇచ్చాడు. ట్విస్ట్ ఏంటంటే, మళ్లీ అదే వ్యక్తికి 4 నెలల తర్వాత హోటల్ ది ప్లాజాకు ఇన్‌ఛార్జ్ జనరల్ మేనేజర్‌గా 2025 డిసెంబర్ 27న బాధ్యతలు అప్పగించారు. ఇది ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఆరోపణలు ఉన్న వ్యక్తికి తిరిగి మళ్లీ బాధ్యతలు అప్పగించడం, నిధుల రికవరీ చేయాల్సి ఉన్నప్పటికీ మళ్ళీ ఉన్నతాధికారులు ఆయనకు బాధ్యతలు అప్పగించడం, ఆ ప్లాజాను ఎలా ముందుకు తీసుకెళ్తారని, లాభాల బాట ఎలా పట్టిస్తారని ఆ శాఖ ఉద్యోగుల్లోనే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఉన్నతాధికారులకు తెలుసా?
ఏ శాఖలోనైనా ఒక అధికారి పోస్టులు భర్తీ చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని సమాచారం. టూరిజం శాఖకు సంబంధించిన కోర్సు చదివిన వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, అలాంటిదేమీ లేకుండానే శాఖలోని కొంతమంది అధికారులు నిబంధనలకు తిలోదకాలిచ్చి తమకు అనుకూలమైన వారిని, నచ్చిన పోస్టులు పెట్టుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. శాఖలోని ప్రతి సెక్షన్‌లో వారికి సంబంధించిన అనుచరులను నియమించుకుంటున్నారని సమాచారం. దీంతో ఆ అధికారులు శాఖపై పట్టు పెంచుకొని సొంత ఆదాయం పెంచుకునే పనిలో నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారా, లేకుంటే శాఖను మరింత దివాలా తీయిస్తారా అనేది చూద్దాం.
Also Read: IND vs SA 3rd ODI: వైజాగ్‌లో నిర్ణయాత్మక మ్యాచ్.. మూడో వన్డే గెలిచేదెవరు? సిరీస్‌ను సాధించేదెవరు?

