IND vs SA 3rd ODI: భారత్ – సౌతాఫ్రికా మధ్య నేడు నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. వైజాగ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలుపొందిన జట్టు వన్డే సిరీస్ ను కైవసం చేసుకోనుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ లో మెుదటిది భారత్ గెలవగా.. రెండోది సౌతాఫ్రికా సొంతం చేసుకుంది. దీంతో ఆఖరి మ్యాచ్ లో హోరా హోరీ ఫైట్ తప్పదని అర్థమవుతోంది. అయితే ఇప్పటికే టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న సౌతాఫ్రికా.. వన్డేను సొంతం చేసుకొని భారత్ ను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. అటు టీమిండియా టెస్ట్ సిరీస్ పరాభవానికి గట్టిగా బుద్ది చెప్పాలని ఉవ్విళ్లూరుతోంది.
41 ఏళ్ల రికార్డు..
ప్రస్తుతం సౌతాఫ్రికాను ఓ రికార్డు ఊరిస్తోంది. భారత పర్యటనకు వచ్చిన ఒక విదేశీ జట్టు గత 41 ఏళ్లలో వరుసగా వన్డే, టెస్టు సిరీస్ ను గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా భారత్ పై ఉన్న ఆ రికార్డును చెరిపేయాలని సౌతాఫ్రికా జట్టు భావిస్తోంది. ఇదిలా ఉంటే గత మ్యాచ్ లో 350+ స్కోర్ చేసినప్పటికీ భారత్ ఓటమి పాలైంది. డ్యూ ఫ్యాక్టర్ కారణంగా రెండో వన్డేలో భారత్ ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోయింది. దీంతో వైజాగ్ మ్యాచ్ లోనూ టాస్ కీలకం కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునేందుకు మెుగ్గు చూపొచ్చు.
వైజాగ్ పిచ్ రిపోర్టు..
ఇటీవల అక్టోబర్ లో మహిళా ప్రపంచ కప్ మ్యాచ్ లు వైజాగ్ లో జరిగాయి. ఆ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు చాలా అనుకూలంగా స్పందించింది. అయితే డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి.. మెుదట బౌలింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. రాత్రి వేళ డ్యూ ఫ్యాక్టర్ ప్రభావవంతంగా మారొచ్చు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో మెుదట బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు 330 పరుగులు చేసింది. అయినప్పటికీ డ్యూ ఫ్యాక్టర్ కారణంగా బౌలింగ్ పై పట్టు కోల్పోయి.. మ్యాచ్ ను చేజార్చుకుంది. వైజాగ్ లో భారత జట్టు 10 వన్డేలు ఆడగా అందులో 7 గెలిచింది. 2023లో చివరిగా ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో భారత్ ఓటమిపాలవడం గమనార్హం.
తిలక్ వర్మకు చోటు..
కీలకమైన మూడో వన్డేలో టీమిండియా మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో తిలక్ వర్మను జట్టులోకి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత రెండు వన్డేల్లో బ్యాటింగ్ లో అవకాశం వచ్చినప్పటికీ వాషింగ్టన్ ప్రభావం చూపలేకపోయాడు. అటు బౌలింగ్ లోనూ టీమిండియా అతడ్ని పెద్దగా ఉపయోగించుకోలేదు. గత రెండు మ్యాచ్ ల్లో డ్యూ ఫ్యాక్టర్ కారణంగా 3-4 ఓవర్లకే సుందర్ ను పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో మూడో వన్డేలోనూ భారత్ టాస్ ఓడితే సుందర్ స్థానంలో తిలక్ రావడం ఖాయమేనని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Also Read: Special Trains: ఇండిగో సంక్షోభం.. 1000 పైగా విమానాలు రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
రో – కో వైపే అందరి చూపు..
వైజాగ్ లో జరగనున్న మూడో వన్డేలో రోహిత్ – కోహ్లి దుమ్మురేపాలని భారత అభిమానులు భావిస్తున్నారు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో సిరీస్ ముగించాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే రెండు వరుస సెంచరీలతో సత్తా చాటిన కోహ్లీ ఈ మ్యాచ్ లో హ్యాట్రిక్ పై కన్నేశారు. రెండు మ్యాచుల్లో విఫలమైన యశస్వి జైస్వాల్ నుంచి పెద్ద ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. ఇక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే సీనియర్ పేసర్లు బుమ్రా, సిరాజ్, షమీ లేని లోటు స్ఫష్టంగా కనిపిస్తోంది. హర్షిత్, అర్షదీప్ బౌలింగ్ లో ఆకట్టుకుంటున్నప్పటికీ ప్రసిధ్ మాత్రం దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. మూడో వన్డేలో ఇలాంటి తప్పు జరగకుండా ప్రసిధ్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. మెుత్తం మీద ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన జట్టుకే విజయవకాశాలు మెండుగా ఉండనున్నాయి.

