Pakistan: భారత్ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్-2026ను బహిష్కరించాలనే యోచనలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఉన్నట్టుగా కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌కు సానుభూతి చూపుతూ ఈ దిశగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పీసీబీ చీఫ్ మోహ్సిన్ నఖ్వీ సోమవారం నాడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో కూడా భేటీ అయ్యారు. అయితే, దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ, తుది నిర్ణయం మాత్రం ఇంకా వెలువరించలేదు. ఈ వారాంతంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే, ఒకవేళ నిజంగా టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ వైదొలగితే, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
పాక్‌కు ఎదురయ్యే పరిణామాలివే
ఐసీసీలోని పూర్తి స్థాయి సభ్య దేశంగా టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనేందుకు సమ్మతి తెలుపుతూ చాలా కాలం కిందటే పాకిస్థాన్ సంతకాలు చేసింది. దీనిని టోర్నమెంట్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ అంటారు. ఈ అగ్రిమెంట్‌ను ఉల్లంఘిస్తూ చివరి నిమిషంలో పాకిస్థాన్ తప్పుకుంటే చట్టబద్ధమైన ఒప్పందాన్ని అతిక్రమించినట్టు అవుతుంది. ఈ విధంగా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు అందాల్సిన వార్షిక ఆదాయ వాటాను నిలిపివేస్తామన్నట్టుగా ఐసీసీ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. పాకిస్థాన్ నిజంగానే తప్పుకుంటే, సుమారుగా 34.5 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో దగ్గరదగ్గరగా రూ. 316 కోట్ల మేర పాకిస్థాన్ నష్టపోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇంత భారీ ఆదాయానికి గండిపడితే మరిన్ని కష్టాల పాలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also- Barabar Premistha: ‘మళ్లీ మళ్లీ’.. ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి మాంచి రొమాంటిక్ ట్రాక్ వదిలారు
ఐసీసీ ఆంక్షల ముప్పు!
ఆదాయం విషయంలోనే కాదు, ఆంక్షల విషయంలో కూడా పాకిస్థాన్‌కు ఇబ్బందులు కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయ జోక్యం విషయంలో ఐసీసీ ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పాకిస్థాన్ ఒకవేళ నిజంగానే బాయ్‌కాట్ చేసి, అది ఆ దేశ ప్రభుత్వ సలహా మేరకే జరిగిందని ఐసీసీ భావిస్తే, అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెన్షన్ ముప్పు కూడా పొంచివుంటుంది. గతంలో జింబాబ్వే, శ్రీలంక జట్లకు జరిగినట్లే పాకిస్థాన్‌పై నిషేధం పడే అవకాశం ఉంటుందని క్రికెట్ నిపుణులు అంటున్నారు. మరోవైపు, 2028 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ తప్పుకుంటే, ఉమెన్స్ వరల్డ్ కప్ ఆతిథ్యహక్కులను ఐసీసీ వెనక్కి తీసుకోవడం ఖాయం.
మరోవైపు, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (PSL) కూడా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, పాకిస్థాన్ వరల్డ్ కప్‌లో పాల్గొనకపోతే, విదేశీ ఆటగాళ్లు ఎవరూ పీఎస్‌ఎల్‌లో ఆడవద్దంటూ ఐసీసీ, లేదా ఇతర దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్ సంబంధాల విషయంలో పాకిస్థాన్ ఒంటరి అవుతుంది. ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటాయి. ఐసీసీకి ప్రధాన ఆదాయ వనరు అయిన వరల్డ్ కప్‌కు ఆటంకం కలిగిస్తే పాకిస్థాన్ ఇన్ని పరిణామాలను చవిచూడాల్సి ఉంటుంది. నిజానికి టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టుని పాకిస్థాన్ ఇప్పటికే ప్రకటించింది. కానీ, బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలవాలనే ఉద్దేశం కంటే, భారత్‌ను ఇబ్బందులకు గురిచేయాలనేది పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల లక్ష్యంగా కనిపిస్తోందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏదేమైనా, టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తే.. ఆ దేశ క్రికెట్‌కు ఒక ఆత్మహత్య సదృశ్యంగా భావించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

