Pet Dog Attack: వీధి కుక్కల దాడులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ బెంగళూరులో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ పెంపుడు శునకం మార్నింగ్ వాకింగ్ చేస్తున్న ఓ మహిళను (Pet Dog Attack) విచక్షిణారహితంగా కరిచింది. ముఖం, తల, మెడ, చేతులు, కాళ్లపై తీవ్రమైన గాయాలయ్యాయి. ఎంతలా అంటే ఏకంగా 50కి పైగా కుట్లు పడ్డాయి. సిటీలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో జనవరి 26న ఉదయం ఈ ఘోరం జరిగింది. అమరేష్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క ఒక్కసారిగా ఈ భయంకర దాడి చేసింది.
బాధితురాలు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఘటన జరిగిన రోజు ఉదయం 6.54 గంటల సమయంలో ఆమె ఇంటి ముందే ఈ కుక్క దాడి చేసింది. తీవ్రంగా కరిచింది. గాయాలు ఎంత లోతుగా ఉన్నాయంటే, కొన్నిచోట్ల చర్మం పైకి లేచింది. బాధితురాలిని కాపాడేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కూడా ఆ కుక్క కరిచింది. ప్రస్తుతం వాళ్లిద్దరూ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా బాధితురాలి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉందని వైద్యులు వెల్లడించారు.
యజమానిపై కేసు
కుక్క యజమాని నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందంటూ బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. బాధితుల నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. మరోవైపు, ఈ షాకింగ్ ఘటన పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో కుక్కల పెంచుకునే యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని అంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మరికొందరు బలవుతారని అంటున్నారు.
కాగా, పెంపుడు జంతువుల పట్ల నిర్లక్ష్యంపై వ్యవహరించే యాజమానులపై కేసులు నమోదు చేస్తారు. ఇతరులకు హాని కలిగే అవకాశం ఉందని తెలిసినా, యజమాని తగిన జాగ్రత్తలు తీసుకోకపోయినా పలు సెక్షన్ల కింద కేసు పెట్టవచ్చు. ఇందుకు, జైలుశిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. బెంగళూరు వంటి నగరాల్లో పెంపుడు కుక్కల పెంపకానికి కఠినమైన నిబంధనలు ఉన్నాయని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ప్రతి పెంపుడు కుక్కకు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి లైసెన్స్ ఉండాలని, యాంటీ రేబిస్ వంటి టీకాలు వేయించిన రికార్డులు ఉండాలని గుర్తుచేస్తున్నారు. ఏదేమైనా పెంపుడు కుక్కల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు.
Read Also- MP Etela Rajender: మీ అవసరాలు తీర్చే నాయకున్ని ఎన్నుకోండి: ఎంపీ ఈటెల రాజేందర్

