Amazon layoffs: అసలే కొత్త ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులు నానా ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు, ఉన్న జాబ్‌లు ఊడిపోతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఏఐ విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తర్వాత టెక్ రంగంలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఈ పరిస్థితికి అద్దం పట్టే కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఈ ఒక్క వారంలోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 16,000 ఉద్యోగులను (Amazon layoffs) తొలగించింది. ఒక ప్రకటన ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించింది. అమెరికాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారత్‌లో కూడా వందలాది ఉద్యోగాలు పోయాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఎంప్లాయీస్ ప్రభావితమయ్యారని వివరించింది.
16,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టుగా అమెజాన్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ బెత్ గాలెట్టి ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా బుధవారం (జనవరి 28) అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ కంపెనీలోని అన్ని విభాగాలపైనా ప్రభావం ఉంటుందని, అయితే, ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రభావిత ఉద్యోగులు కంపెనీలోని ఇతర విభాగాల్లో జాబ్స్ కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి 90 రోజుల సమయం ఇస్తున్నట్టు వివరించారు.
Read Also- Rasha Thadani: హీరోయిన్ ఇంట్రో ఏం ఫీల్ ఉంది మామా… అజయ్ భూపతి మామూలోడు కాదు..
మెయిల్స్ ద్వారా సమాచారం
ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టుగా ఉద్యోగులకు మెయిల్స్ ద్వారా అమెజాన్ సమాచారం ఇచ్చింది. అధికారిక ఈ-మెయిల్స్ ద్వారా విషయాన్ని చేరవేస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అమెజాన్ గత కొంతకాలంగా కొనసాగిస్తోంది. అయితే, గత మూడు నెలల్లో చేపట్టిన తొలగింపు ప్రక్రియలో ఇది అతిపెద్దదని కంపెనీ ప్రతినిధులు వివరించారు. 2025 చివరిలో కూడా సుమారుగా 14,000 మందిని తొలగించినట్టు గుర్తుచేశారు.
తొలగింపు ప్రయోజనాలు వర్తింపు
తొలగింపు వేటు పడిన ఉద్యోగులకు అమెజాన్ పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. తొలగింపు పరిహారంతో పాటు ఇతర ప్రయోజనాలను కల్పిస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఈ-మెయిల్స్‌లో వివరాలను వెల్లడిస్తోంది. కాగా, తొలగింపుతో కలుపుకొని ఇటీవలి కాలంలోనే మొత్తం 30,000 వేల మంది ఉద్యోగులను తొలగించినట్టు అయ్యింది. 2023లో రికార్డ్ స్థాయిలో 27,000 మందిని తొలగించగా, దానిని మించి ఇప్పుడు తొలగించడం గమనార్హం.
Read Also- Hydra: ఫైర్ సేఫ్టీపై యాక్షన్ షురూ.. తనిఖీలు ముమ్మరం చేసిన హైడ్రా!
సంస్థాగత మార్పుల దిశగా…
కంపెనీలో సంస్థాగత మార్పులే లక్ష్యంగా అమెజాన్ తొలగింపు బాటలో పయనిస్తోంది. కంపెనీ పనితీరును మరింత సరళీకృతం చేస్తామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. ఈ మేరకు గతేడాది అక్టోబర్‌లోనే స్పష్టత ఇచ్చామని, మేనేజ్‌మెంట్ స్థాయిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిస్తామన్నారు. గతేడాది అక్టోబర్‌లోనే కొన్ని టీమ్‌లు తొలగింపు ప్రక్రియను పూర్తి చేయగా, మరికొన్ని టీమ్‌లు ఇటీవలే ఈ ప్రక్రియను ముగించాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మార్పులు రెగ్యులర్‌గా జరగబోవని, కంపెనీ పనితీరును మెరుగుపరిచే ప్రక్రియలో భాగంగా జరుగుతుంటాయని వివరించారు.
భారత్‌లో ఎవరిపై ప్రభావం?
తాజా తొలగింపులు ఫ్రంట్‌లైన్, అంటే డెలివరీ ఉద్యోగులపై తక్కువ ప్రభావం ఉంటుంది. టెక్నాలజీ, రిటైల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), ప్రైమ్ వీడియో, మీడియా, హ్యూమన్ రిసోర్స్ వంటి డిపార్ట్‌మెంట్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల్లోని కొన్ని టీమ్‌లపై కూడా ప్రభావం పడింది. అయితే, ఏ దేశంలో ఎంతమందిని తొలగించారనే లెక్కలను మాత్రం అమెజాన్ వెల్లడించలేదు.

