Karimnagar Politics: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్
శ్రీనివాస్, ప్రశాంత్‌ను బీజేపీలోకి ఆహ్వానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
బీఆర్ఎస్కు చెందిన పలువురు బీజేపీలో చేరిక
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. కరీంనగర్లో కారు పార్టీ సీనియర్ నేత, 35వ వార్డు కార్పొరేటర్ సాధవేని శ్రీనివాస్ బీఆర్ఎస్కు (Karimnagar Politics) రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో శుక్రవారం ఆయన బీజేపీలో చేరారు. ఆయనతోపాటు కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బండి ప్రశాంత్ సైతం కాషాయ కండువా కప్పుకున్నారు. సంజయ్ సమక్షంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కోమాల అంజనేయులు వారికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Read Also- Notices to KCR: కేసీఆర్‌కు మళ్లీ సిట్ నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం!
తాను కరీంనగర్ అభివృద్ధి కోసం నయాపైసా తీసుకురాలేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతూ కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధికి కేంద్రం తెచ్చిన నిధుల వివరాలను వెల్లడించారు. కేంద్రం నుంచి దాదాపు రూ.1500 కోట్లకు పైగా నిధులు తెచ్చి కరీంనగర్‌ను అభివృద్ధి చేసినట్లు బండి సంజయ్ తెలిపారు. కళ్లుండి చూడలేని కబోధులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. ఎలక్షన్స్ సమయంలో తప్ప కరీంనగర్ ముఖం చూడని నాయకులు తనపై ఆరోపణలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Read Also- MLA Kaushik Reddy: సమ్మక్క జాతరలో ఓవరాక్షన్.. పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ సంఘం సీరియస్
కరీంనగర్ పార్లమెంట్ ప్రజల పక్షాన తాను చేసిన పోరాటాలు, కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చానో, ఏయే ప్రాజెక్టులు, పథకాలు తీసుకొచ్చానే ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందనేది ముమ్మాటికీ నిజమన్నారు. ఈమేరకు కరీంనగర్ మాజీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు ఓదెలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ముందు కరీంనగర్లో కీలక నేతలు బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరడం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా కార్పొరేటర్ స్థాయి నేతలు పార్టీ మారడంతో క్షేత్రస్థాయి ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరోవైపు, బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినొచ్చనే విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఈ వలసలు అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరుకు దారితీసేలా అక్కడి వాతావరణం కనిపిస్తంది.

