District Demand: హుజూరాబాద్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే చిరకాల వాంఛ నియోజకవర్గంలో మళ్లీ ఉద్యమ రూపం దాల్చింది. హుజూరాబాద్(Hujurabad) జిల్లా సాధన జేఏసీ(JAC) పిలుపు మేరకు మంగళవారం పట్టణం నిరసన జ్వాలలతో హోరెత్తింది. కేవలం రాజకీయ నినాదాలకే పరిమితం కాకుండా, వృత్తి సంఘాలు సైతం ఈ పోరాటంలో నేరుగా భాగస్వాములు కావడంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. ముఖ్యంగా “కెమిస్ట్ – డ్రగిస్ట్ అసోసియేషన్”, మరియు “శ్రీ విఘ్నేశ్వర ఆర్.ఎం.పి – పి.ఎం.పి ల అసోసియేషన్” సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ భారీ నిరసన కార్యక్రమం ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరికను పంపింది.
జేఏసీ కన్వీనర్ భీమోద్ సదానందం
బస్సు డిపో చౌరస్తాలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ, సైదాపూర్ చౌరస్తా మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌరస్తా వరకు సునామీలా సాగింది. “హుజూరాబాద్ జిల్లా – మన హక్కు” అంటూ వేలాది గొంతుకలు ఒక్కసారిగా నినదించడంతో పట్టణ వీధులు మారుమోగాయి. ప్రధాన రహదారిపై బైఠాయించిన నిరసనకారులు, హుజూరాబాద్‌కు జిల్లా హోదా కల్పించడంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోద్ సదానందం మాట్లాడుతూ.. భౌగోళికంగా, జనాభా పరంగా హుజూరాబాద్ కంటే చాలా చిన్నవైన ప్రాంతాలను గత ప్రభుత్వాలు జిల్లాలగా మార్చినప్పటికీ, అన్ని వనరులు మరియు అర్హతలు ఉన్న హుజూరాబాద్‌ను ఉద్దేశపూర్వకంగా విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన లేదా ప్రక్షాళన చేపట్టనున్న నేపథ్యంలో, హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించడమే కాకుండా, ఈ మట్టి బిడ్డ, దేశ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు(PV Narasimha Rao) గౌరవార్థం ఈ జిల్లాకు ‘పీవీ జిల్లా’గా పేరు పెట్టాలని వారు డిమాండ్ చేశారు.
Also Read: Chiranjeevi Movie: రికార్డ్ బ్రేక్ చేసిన ‘మన శంకరవరప్రసాద్ గారు’.. 15 రోజుల గ్రాస్ ఎంతంటే?
కెమిస్ట్ డ్రగ్గిస్ట్ నాయకులు
సుమారు రెండు గంటల పాటు వరంగల్ – కరీంనగర్ ప్రధాన రహదారి దిగ్బంధం కావడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పరిస్థితిని గమనించిన టౌన్ సీఐ కరుణాకర్ తన సిబ్బందితో ఆందోళనకారుల వద్దకు చేరుకుని చర్చలు జరిపారు. ప్రజల ఆకాంక్షను, డిమాండ్లను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ నాయకులు కర్ర పాపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాజేశం, ఆర్ఎంపి పిఎంపీల సంఘం నాయకులు కందగట్ల శ్రీనివాస్, చిలకమారి శ్రీనివాస్, అడ్డగట్ల కృష్ణమూర్తి, కొలిపాక జగదీష్, మంచికట్ల సదానందం, పిట్ట శ్రీనివాస్ తో పాటు జేఏసీ నాయకులు పలకల ఈశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పొడిశేట్టి వెంకటరాజం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: CI Mahender Reddy: ప్రయాణాలు చేసే వారు.. ఈ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి.. సీఐ మహేందర్ రెడ్డి!

