Govt School Neglected: వీణవంక మండలం కనపర్తి గ్రామంలో దుస్థితిలో ప్రభుత్వ పాఠశాల
ప్రభుత్వ ఆవరణలో అడవిని తలపించే చెట్లు, పొదలు
కోతులు, కుక్కల భయంతో చదువుకు దూరమవుతున్న చిన్నారులు
నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శన ఘటన
చిన్న గ్రామం కావడమేనా జిల్లా కలెక్టర్‌కు కనిపించకపోవడానికి కారణం..?
హుజురాబాద్/వీణవంక, స్వేచ్ఛ: జిల్లాలోని వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితి (Govt School Neglected) చూస్తే ఇది నిజంగా పాఠశాలేనా?, పాడుబడిన భవనమా? అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమా? అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల ఆవరణలో పెరిగిపోయిన చెట్లు, పొదలు అడవిని తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నారులను బడికి పంపాలంటే తల్లిదండ్రుల గుండెలు గుభేలు మంటున్నాయి.
పిల్లల భద్రతపై అధికారులకు బాధ్యత లేదా..?
ప్రతి రోజు బడికి వెళ్లే చిన్న పిల్లలు కోతులు, కుక్కల సంచారంతో ప్రాణభయం మధ్య చదువు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఇది తెలిసినా సంబంధిత అధికారులు, విద్యాశాఖ, మండల స్థాయి అధికారులు కళ్లు మూసుకుని కూర్చోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. చదువుకోవాల్సిన చోట భయమే పాఠ్యాంశమా? అని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలలో భద్రత లేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం, పిల్లల ఆట స్థలం లేకపోవడం ఇక్కడ పాఠశాల అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతోంది.
అసంఘగత కార్యకలాపాలకు అడ్డా
ఈ పాఠశాల ప్రాంగణం అసంఘటిత కార్యకలాపాలకు అడ్డాగా మారవొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాల ఆవరణలో చెట్ల పొదలతో నిండిపోవడంతో చెడు పనులకు కేంద్రంగా మారే ప్రమాదం ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది?, అప్పుడైనా అధికారులు స్పందిస్తారా? అన్న ప్రశ్నలు ప్రజల నోట వినిపిస్తున్నాయి. చెట్లు తొలగించి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామ ప్రజలు, గ్రామ యువత ఇదేమాట చెబుతున్నారు. వెంటనే పాఠశాల ఆవరణలోని చెట్లు, పొదలను తొలగించాలని అధికారులను కోరుతున్నారు. పిల్లలకు భద్రత కల్పించేలా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదం జరిగాక స్పందిస్తారా?, ముందే చర్యలు తీసుకుంటారా? అని గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు. చిన్న గ్రామం సమస్య అయితే పట్టించుకోరా? అంటూ నైరాశ్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందన కోసం కనపర్తి గ్రామ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
Read Also- Peddi Special Song: ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్ కోసం రెడీ అవుతున్న టాప్ హీరోయిన్.. ఎవరంటే?

