MLA Kaushik Reddy: కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ని మతం పేరుతో దూషించిన వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీపీ గౌష్ ఆలంపై ఆయన చేసిన వ్యాఖ్యలు దురుద్దేశ పూరితమైనవని, నిరాధారమైనవని పేర్కొంది. కౌశిక్ రెడ్డి దుర్మార్గపు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఐపీఎస్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న అధికారిపై వ్యక్తిగత దాడి చేయడం చట్టరిత్యా నేరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌశిక్ రెడ్డి చేసిన మతమార్పిడుల ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్న ఐపీఎస్ సంఘం.. ఈ ఘటన సివిల్ సర్వీసుల మనోబలాన్ని దెబ్బతీసే విధంగా ఉందంటూ ఆక్షేపించింది.
బహిరంగ క్షమాపణలకు డిమాండ్
ఎమ్మెల్యే ప్రవర్తనపై తక్షణ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐపీఎస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో పాడి కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని పట్టుబట్టింది. ‘ఈ సంఘటనను పౌర సేవల నైతికత, గౌరవంపై తీవ్రమైన దాడిగా అసోసియేషన్ భావిస్తోంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. సిట్టింగ్ శాసనసభ్యుడి ఈ తీవ్రమైన దుష్ప్రవర్తనను గుర్తించాలని సంబంధిత అధికారులను కూడా మేము కోరుతున్నాము’ అని బహిరంగ ప్రకటనలో పేర్కొంది.
తెలంగాణ పోలీసు సంఘం సైతం..
మరోవైపు తెలంగాణ పోలీసు అధికారుల సంఘం సైతం పాడి కౌశిక్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ‘నిన్న వీణవంక మినీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల మీద చేసిన వ్యాఖ్యలను, వారి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్న పోలీసుల పట్ల ఎమ్మెల్యే చేసిన అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా సరైంది కాదు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా గుంపులుగా వెళ్లడమే కాకుండా, బాధ్యత గల ప్రజా ప్రతినిధి అయి ఉండి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వెళ్ళడానికి ప్రయత్నించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం దురదృష్టకరం. మహిళా పోలీసు అధికారులపట్ల కూడా దురుసుగా ప్రవర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం గర్హనీయం. పోలీసు అధికారులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’ అని తెలంగాణ పోలీసు సంఘం రాష్ట్ర అధ్యక్షులు యేదుల గోపిరెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: Realme 16 5G: రియల్మీ నుంచి టాప్ రేటెడ్ ఫోన్.. ఫీచర్లు ఏంటి భయ్యా.. ఇంత బాగున్నాయ్!
అసలేం జరిగిందంటే?
కరీంనగర్ జిల్లా వీణవంకలో స్థానికంగా సమ్మక్క జాతర వేడుకగా సాగుతోంది. ఈ జాతరకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబసమేతంగా భారీ కాన్వాయ్‌తో గురువారం వెళ్లారు. అయితే హైకోర్టు ఆదేశాల దృష్ట్యా పరిమిత వాహనాలనే అనుమతి ఇస్తామని ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు. దాంతో పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కారులో నుంచి దిగి.. తన కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలంపై ఆయన మతపరమైన అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి కారణమైంది.
డ్యూటీ చేస్తున్న యూనిఫాం పోలీసుపై దాడికి దూకిన
Rowdy MLA – పాడి కౌశిక్ రెడ్డి.ఎమ్మెల్యేనా?
లేక రోడ్లపై రౌడీనా…! pic.twitter.com/hzz8R4Flnt— Kattar Congress (@kattarcongresii) January 29, 2026

