Menstrual Health: దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. నెలసరి ఆరోగ్యం, దానితో ముడిపడిన పరిశుభ్రత (Menstrual Health and Hygiene) హక్కు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు), ఆర్టికల్ 21ఏలో (ఉచిత, నిర్బంధ విద్య)లో అంతర్భాగమని స్పష్టం చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ, లేదా ప్రైవేట్ స్కూళ్లు, అవి పట్టణాల్లో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా తప్పనిసరిగా బాలికలందరికీ అత్యున్నత భద్రత, పరిశుభ్రత ప్రమాణాలతో కూడిన పర్యావరణ హితమైన శానిటరీ నాప్కిన్లను ఉచితంగా అందించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఒక పిల్‌పై తీర్పు న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది.
స్కూళ్లలో ఏర్పాట్లు ఉండాల్సిందే
నాప్కిన్లు ఇవ్వడంతో పాటు స్కూళ్లు అన్నింటిలోనూ నెలసరి పరిశుభ్రత నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేసేలా అన్ని అధికార యంత్రాంగాలు చర్యలు తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. శానిటరీ వ్యర్థాలను పారవేసే విధానానికి సంబంధించి కూడా కోర్టు వివరణాత్మకమైన ఆదేశాలను పేర్కొంది. ‘‘ఈ తీర్పు కేవలం న్యాయ వ్యవస్థకు సంబంధించినవారికే మాత్రమే పరిమితం కాకూడదు. సాయం అడగడానికి సంకోచించే క్లాస్ రూముల్లోని బాలికల కోసం ఈ తీర్పు. సహాయం చేయాలనుకున్నా వనరులు లేక ఇబ్బంది పడుతున్న టీచర్ల కోసం ఈ తీర్పు ఇస్తున్నాం. బలహీనులను ఎంతగా రక్షిస్తామనే దానిపైనే మన ప్రగతి ఆధారపడి ఉంటుంది’’ అని జస్టిస్ జేబీ పార్థివాలా వ్యాఖ్యానించారు.
Read Also- Animal Fat Row: శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు దుమారంపై టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన
సౌకర్యాలు లేక చదువుకు దూరం
స్కూళ్లలో బాలికలకు ప్రత్యేక సదుపాయాలు లేకపోవడం, నెలసరి పరిశుభ్రత ఉత్పత్తులు అందకపోవడంతో చాలా మంది చదువు మానేస్తున్నారని సుప్రీంకోర్ట్ వ్యాఖ్యానించింది. ఇది వారి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని కోర్టు పేర్కొంది. విద్య, సమానత్వం, ఆరోగ్యం, గౌరవం, గోప్యత హక్కులను భంగపరిచినట్లేనని విస్తృతంగా వివరించింది. విద్యా హక్కు అనేది ఇతర మానవ హక్కులను వినియోగించుకోవడానికి శక్తినిచ్చే ఒక శక్తివంతమైన బహుళ హక్కు అని, ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగమని అభివర్ణించింది.
బాలికల విద్యకు ఆటంకంగా ఉన్న సంస్థాగత, సామాజిక అడ్డంకులను తొలగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అడ్డంకులను తొలగించడం కూడా విద్యా హక్కులో భాగమేనని వ్యాఖ్యానించింది. నెలసరి పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడంతో బాలికలు స్కూళ్లకు హాజరు కాలేకపోతున్నారని, ఇది వారి ఇతర ప్రాథమిక హక్కులను ప్రభావితం చేస్తోందని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

