Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇవాళే(శనివారం) ఆమె ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆమె బారమతి నుంచి ముంబయికి చేరుకున్నట్లు కూడా ఎన్సీపీ వర్గాలు పేర్కొన్నాయి.
సా. 5 గంటలకు ప్రమాణం!
సునేత్ర పవార్ తన కుమారుడు పార్థ్ తో కలిసి తెల్లవారుజామున దక్షిణ ముంబయి లోని తన దివంగత భర్త అజిత్ పవార్ నివాసానికి చేరుకున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) శాసన సభా పక్ష సభ్యులతో ఆమె సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అజిత్ పవార్ స్థానంలో తమ నాయకురాలిగా సునేత్రను ఎన్సీపీ సభ్యులు ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎంపిక అనంతరం సాయంత్రం 5 గంటలకు ఆమె మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అధికారికంగా బాధ్యతలు చేపడతారని సమాచారం. అదే జరిగితే మహారాష్ట్రలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా నేతగా సునేత్ర పవార్ నిలవనున్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య #SunetraPawar. మహారాష్ట్ర మొదటి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్
Sunetra Pawar, wife of late #ajithpawar is deputy chief minister of maharashtra.She is likely to take oath as Maharashtra's… pic.twitter.com/2b6D1Bix9G
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026
నాకు తెలీదు: శరద్ పవార్
సునేత్ర పవార్ డిప్యూటీ సీఎం కాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు ఆమె బాధ్యతలు చేపట్టే విషయమై తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) సభ్యులు, మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చని చెప్పారు. కాగా ప్రస్తుతం సునేత్ర.. రాజ్య సభ ఎంపీగా ఉన్నారు. ఆమె బారామతి టెక్స్టైల్ కంపెనీ చైర్పర్సన్, ఎన్విరాన్మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా సీఈఓగానూ వ్యవహరిస్తున్నారు.
సునేత్ర పవార్ నేపథ్యం
సునేత్ర పవార్ నేపథ్యానికి వస్తే.. ఆమె 1963 అక్టోబర్ లో జన్మించారు. ఔరంగాబాద్‌లోని SB కళాశాల నుండి పూర్తి చేశారు. సునేత్ర బలమైన రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచే వచ్చారు. ఆమె తండ్రి బాజీరావు పాటిల్ స్థానికంగా బలమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. 1985లో అజిత్ పవార్ తో వివాహం అనంతరం.. ఆమె బారామతి హై-టెక్ టెక్స్ టైల్ పార్క్ అనే ప్రముఖ పారిశ్రామిక సంస్థకు నాయకత్వం వహించడం ప్రారంభించారు. ఆమె విద్యా ప్రతిష్ఠన్ అనే విద్యా సంస్థకు ట్రస్టీగానూ ఉన్నారు. 2010లో ఆమె ఎన్విరాన్మెంటల్ ఫోరం ఆఫ్ ఇండియా (EFOI)ను స్థాపించి దీని ద్వారా కటేవాడి గ్రామాన్ని దేశంలోని మొట్టమొదటి ‘పర్యావరణ గ్రామం’గా తీర్చిదిద్దారు.
Also Read: TG Revenue Department: భూ భారతి లో కీలక పరిణామం.. భూ కొలతలకు కొత్త టెక్నాలజీ మిషన్లు!
అజిత్ పవార్ మరణం..
బుధవారం (జనవరి 28) ఉదయం బారామతి విమానాశ్రయంలో సమీపంలో జరిగిన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు. విమానం రన్ వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తి ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. దీంతో భారీగా మంటలు చెలరేగి.. అందులో ప్రయాణిస్తున్న డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఆరుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబయి నుంచి బారామతి వస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

