Tourism Scam: టూరిజంశాఖలో మరో దందాకు అధికారులే తెరదీశారనే ప్రచారం జరుగుతుంది. టికెట్ల రాయితీ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వానికి రావాల్సిన అదాయానికి గండిపెడుతూ జేబులు నింపుకుంటున్నారని ప్రచారం ఊపందుకుంది. ఆదాయ మార్గాలు అన్వేశించాల్సిన శాఖను గట్టెక్కించాల్సిన వారే.. గండిపెడుతుండటంతో టూరిజం శాఖ నష్టాల్లో కూరుకుపోతుంది. ఉన్నతాధికారులు దృష్టసారిస్తే తప్ప ఈ తతంగానికి ఫుల్ స్టాప్ పడేలా లేదు.
అందినకాడికి దండుకొవడం
వీకెండ్ లో ఎక్కువగా ప్రజలు పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తుంటారు. ఇతర రాష్ట్రాల పర్యటకులు సైతం ఆకసక్తి చూపుతుంటారు. అందుకోసం పర్యాటకులు(Tourists) పర్యాటకశాఖకు చెందిన బస్సులను బుక్ చేసుకుంటారు. అయితే అదే అదునుగా భావించి అధికారులు ‘రాయితీ’ పేరుతో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యాటకులకు ఇచ్చే రాయితీ సౌకర్యాన్ని ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుని అందినకాడికి దండుకుంటున్నారని సమాచారం. పర్యాటకుల నుంచి టికెట్లకు పూర్తి డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బంది.. రికార్డుల్లో మాత్రం వారికి రాయితీ ఇచ్చినట్లు చూపిస్తూ ఆ మిగిలిన డబ్బును వెనకేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటం, ఆడిటింగ్ లోపాలతో రాయితీ దందా కొనసాగుతున్నట్లు సమాచారం.
Also Read: Telangana Tourism: అమరగిరి టు మల్లేశ్వరం.. టూరిజం ప్లేసులో మార్పు.. కనికరించని అటవీ శాఖ!
రాయితీ ఇచ్చినట్లు నమోదు
సాధారణంగా బస్సుల్లో బుకింగ్స్, పర్యాటక ప్రదేశాలు, బోటింగ్ పాయింట్లు, హరిత హోటళ్లలో పిల్లలకు, వృద్ధులకు లేదా గ్రూప్ బుకింగ్‌లకు ప్రభుత్వం రాయితీ సౌకర్యం కల్పిస్తుంది. ఇక్కడే సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి అరుణాచలం బస్సులో వెళ్లాలనుకుంటే బస్సు టికెట్ ధర రూ.8 వేలు అనుకుంటే ఆ ఉద్యోగి పర్యాటకుడి దగ్గర రూ.8వేలు తీసుకుని టికెట్ బుక్ చేస్తాడు. కానీ సిస్టమ్‌లో లేదా రికార్డు పుస్తకంలో మాత్రం సదరు పర్యాటకుడిని ‘స్పెషల్ కేటగిరీ’ కింద చూపిస్తూ 20 నుంచి 30 శాతం రాయితీ ఇచ్చినట్లు నమోదు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ ఖాతాకు రూ.5 నుంచి రూ.6 వేలు మాత్రమే వెళ్తుంది. మిగిలిన 3వేలు లేదా 2వేలు ఉద్యోగి జేబులోకి వెళ్తున్నట్లు సమాచారం. కేవలం ఇదేకాదని బోటింగ్, హరిత హోటల్స్(Hotels), పర్యాటక ప్రాంతాల టికెట్ల విషయంలో నూ ఈ వ్యవహారం నడుస్తోందనే ఆరోపణలు జోరందుకున్నాయి. రోజుకు వందల సంఖ్యలో వచ్చే పర్యాటకులతో నెలకు రూ.లక్షల్లోనే శాఖకు రావల్సిన ఆదాయం గండి పడుతోందని సమాచారం. ఈ వ్యవహారం అంతా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నా పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు మాముళ్లు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఆన్‌లైన్ టికెటింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల మాన్యువల్ ఎంట్రీలు, మరికొన్ని చోట్ల సాఫ్ట్‌వేర్ పనిచేయడం లేదని చెబుతూ ఈ దందా నడిపిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు లేకపోవడంతో సిబ్బందికి అడ్డూ అదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. టూరిజం శాఖలో ఇలాంటి చేతివాటం కొత్తేమీ కాదని ఆ శాఖ ట్రాక్ రికార్డు తీస్తే స్పష్టమవుతోంది.
కీలకమైన పైల్లు దగ్దం
గతంలోనూ శాఖలో ఉద్యోగులు శాఖ ఆదాయంను పక్కదారి పట్టించిన దాఖలాలు ఉన్నాయి. ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ప్రియుడి కోసం కోటి రూపాయలకు పైగా నిధులను పక్కదారి పట్టించిన ఘటన శాఖ ఆడిట్ లో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనికి ముందు టూరిజం హోటల్స్‌లో స్వైపింగ్ మిషన్ల ద్వారా రూ.70 లక్షలు కాజేయగా ఆ నిధులను రికవరి చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే వరుస ఘటనలు జరిగినా అధికారులు మేల్కోవడం లేదని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో టూరిజం కార్పొరేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. అప్పుడు కీలకమైన పైల్లు దగ్దం అయినట్లు అధికారులే తెలిపారు. అన్ని ఘటనలపై అప్పట్లో హడావుడి చేసిన అధికారులు, విజిలెన్స్ విచారణలు చేపట్టినా ఆతర్వాత పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది కూడా ప్రకటించలేదు. తూతూమంత్రంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటుండటంతోనే శాఖలోని ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా పకడ్బందీ చర్యలు తీసుకుంటారా? ఉద్యోగులపై పర్యవేక్షణ చేస్తారా? లేదా? అనేది చూడాలి.

