Special Trains: భారత్ లోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వరుసగా ఐదో రోజు కూడా విమాన సేవల్లో అంతరాయం ఏర్పడింది. దేశ వ్యాప్తంగా దాదాపు 1000 పైగా విమాన సేవలను ఆ సంస్థ రద్దు చేసింది. పరిస్థితి చక్కబడేందుకు మరో 5-10 రోజుల సమయం పటొచ్చని ప్రచారం జరుగుతోంది. దీంతో విమాన ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఫలితంగా రైళ్లల్లో అనూహ్యంగా రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
37 రైళ్లు.. 116 అదనపు బోగీలు
ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని దేశవ్యాప్తంగా 37 ప్రీమియం రైళ్లలో అదనపు బోగీలను ఏర్పాటు చేసింది. ఆయా రైళ్లలో ప్రయాణికుల సౌకర్యార్థం 116 అదనపు బోగీలను జోడించినట్లు రైల్వే మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో అత్యధికంగా దక్షిణ మధ్య రైల్వేలోని 18 రైళ్లు ఉన్నట్లు తెలిపింది.
అధిక రద్దీ ఉండే మార్గాల్లో..
అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో అదనపు చైర్ కార్, స్లీపర్ క్లాస్ బోగీలను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది. నేటి నుంచి (డిసెంబర్ 6) ఈ అదనపు బోగీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. నార్త్ రైల్వే జోన్ పరిధిలో 8 రైళ్లలో 3AC, చైర్ కార్ బోగీలను జోడించినట్లు రైల్వే శాఖ తెలిపింది. దీని ద్వారా ఉత్తర భారతంలో అధిక రద్దీ ఉండే మార్గాల్లో సీట్ల లభ్యతను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. ‘పశ్చిమ రైల్వేలో అధిక డిమాండ్ ఉన్న నాలుగు రైళ్లలో 3AC, 2AC బోగీలు జోడించాం. ప్రయాణికులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాన్ని సులభతరంగా మార్చుకోండి’ అని సూచించింది.
ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో..
మరోవైపు ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడిచే రాజేంద్ర నగర్ – న్యూ దిల్లీ (12309) రైలులో డిసెంబర్ 6 – 10 తేదీల మధ్య అదనపు 2AC బోగీలు అందుబాటులో ఉంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు బిహార్ – ఢిల్లీ ప్రధాన రూట్‌లో సామర్థ్యాన్ని పెంచినట్లు పేర్కొంది. మరోవైపు నార్త్ ఈస్ట్ రైల్వే డిసెంబర్ 6 నుంచి 13 వరకు రెండు ప్రధాన రైళ్లకు 3AC, స్లీపర్ బోగీలను జోడించింది. తద్వారా ఈశాన్య ప్రాంత ప్రయాణికులకు సులభతర ప్రయాణానికి సౌకర్యం కల్పించింది.
Also Read: IndiGo Flight Crisis: ఇండిగో తప్పు చేసింది.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. విమానయాన మంత్రి వార్నింగ్
నాలుగు స్పెషల్ ట్రైన్స్
పైన పేర్కొన్న అదనపు బోగీలతో పాటు మరో 4 ప్రత్యేక రైళ్లను సైతం రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. గోరఖ్‌పూర్ – ఆనంద్ విహార్ టెర్మినల్ – గోరఖ్‌పూర్ స్పెషల్ రైలు (05591, 05592) డిసెంబర్ 7- 9 తేదీల మధ్య అందుబాటులో ఉంటుంది. న్యూ ఢిల్లీ – మార్టియర్ కెప్టెన్ తుషార్ మహాజన్ – న్యూ దిల్లీ రిజర్వ్డ్ వందే భారత్ స్పెషల్ (02439, 02440) నేటి నుంచి జమ్మూ కశ్మీర్ వైపు నడవనుంది. అధిక డిమాండ్ ఉన్న వెస్ట్ రూట్ల కోసం న్యూ ఢిల్లీ – ముంబై సెంట్రల్ – న్యూ ఢిల్లీ రిజర్వ్డ్ సూపర్‌ఫాస్ట్ స్పెషల్ (04002, 04001) డిసెంబర్ 6 – 7 తేదీల్లో నడవనుంది. అలాగే హజ్రత్ నిజాముద్దీన్ – తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ (Hazrat Nizamuddin Thiruvananthapuram Central Reserved Superfast Special) రైలును రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.

