Pakistan T20 World Cup: భారత్‌లో భద్రతా కారణాలను చూపుతూ టీ20 వరల్డ్ కప్ 2026 ( Pakistan T20 World Cup 2026) నుంచి వైదొలగిన బంగ్లాదేశ్ (Bangladesh) బాటలోనే పాకిస్థాన్ (Pakistan) కూడా నడుస్తుందా?, బంగ్లాకు సానుభూతి చూపుతూ వరల్డ్ కప్ నుంచి వైదొలగుతుందా? అనే ఉత్కంఠకు తెరపడింది. ఇంత సడెన్‌గా టోర్నమెంట్ నుంచి తప్పుకుంటే నిబంధనల ప్రకారం భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుందని ఐసీసీ కూడా హెచ్చరించిన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆందోళనకు గురైంది. ఊహాగానాలకు తెరదించుతూ వరల్డ్ కప్-2026కు పాకిస్థాన్ టీమ్‌ను ఆదివారం నాడు ప్రకటించింది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన పాక్ జట్టును ఆదివారం నాడు అఫీషియల్‌గా ప్రకటించింది. టోర్నీ నుంచి తప్పుకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి ఉంటుందని ఐసీసీ హెచ్చరించిన కొన్ని గంటల వ్యవధిలోనే పీసీబీ ప్రకటన చేయడం గమనార్హం.
కెప్టెన్‌గా సల్మాన్ అలీ ఆఘా
టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ జట్టుకు సల్మాన్ అలీ ఆఘా నాయకత్వం వహించనున్నాడు. కాగా, జట్టులోకి కీలక ప్లేయర్లు బాబర్, షాహీన్ అఫ్రిదీ రీఎంట్రీ ఇచ్చారు. అయితే, పేస్ బౌలర్ హారిస్ రౌఫ్‌కు మాత్రం మొండిచెయ్యి ఎదురైంది. ఇటీవలి టీ20 సిరీస్‌లో జట్టుకు దూరమైన స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజం, షాహీన్ షా అఫ్రిదీ తిరిగి జట్టులోకి రావడంపై పాక్ క్రికెట్ అభిమానులకు ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది. జట్టులోని ప్లేయర్లను గమనించగా, బ్యాటింగ్ విభాగంలో బాబర్, బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిదీ, నసీమ్ షా కీలక పాత్ర పోషించడనున్నారు. ఎక్స్‌ప్రెస్ పేసర్‌గా పేరున్న హారిస్ రౌఫ్‌ను జట్టు నుంచి తప్పించడం ఆసక్తికరంగా మారింది. 2025 ఆసియా కప్‌లో అతడి పేలవ ప్రదర్శన, ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాష్ లీగ్‌లో (BBL) కూడా అతడు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మరో సీనియర్ ప్లేయర్ మొహమ్మద్ రిజ్వాన్‌కి కూడా పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ చోటివ్వలేదు.
Read Also- Padma Awards 2026: పద్మశ్రీ అవార్డుల ప్రకటన.. ఇద్దరు తెలుగు వ్యక్తులకు పురస్కారం.. ఎవరెవరంటే?
15 మంది సభ్యుల టీమ్ ఇదే
సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా మొహమ్మద్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిదీ, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిక్.
పాకిస్థాన్ షెడ్యూల్ ఇదే
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశలో భారత్ ఉన్న గ్రూపులోనే పాకిస్థాన్ ఉంది. ఆ జట్టు మ్యాచ్‌ల తేదీల విషయానికి వస్తే, ఫిబ్రవరి 7న నెదర్లాండ్‌తో, ఫిబ్రవరి 10న యూఎస్ఏతో, ఫిబ్రవరి 15న ఇండియాతో, ఫిబ్రవరి 18న నమీబియాతో పాకిస్థాన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లు అన్నింటినీ శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఆడనున్నది.

