Ration Rice Scam: పేదవాడి ఆకలి తీర్చాల్సిన ‘ఉచిత ’ బియ్యం హుజూరాబాద్‌లో అక్రమార్కుల జేబులు నింపుతోంది. సామాన్యుడికి దక్కాల్సిన బియ్యాన్ని దళారులు దౌర్జన్యంగా మళ్లించి, కోట్లు రూపాయల దందాకు తెరలేపారు. పట్టణంలోని బాలాజీ లవకుశ రైస్ మిల్లు(Balaji Lavakusha Rice Mill)లో మంగళవారం రాత్రి పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో 290 క్వింటాల రేషన్ బియ్యం లారీతో సహా పట్టుబడటం నియోజకవర్గంలో కలకలం రేపింది. అయితే, ఈ అక్రమ రవాణా అంతా పౌర సరఫరా అధికారుల కళ్లముందే జరుగుతున్నా, వారు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పోలీస్ దాడులు.. అధికారుల ‘దాగుడుమూతలు’
క్షేత్రస్థాయిలో అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతుంటే, దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాల్సిన సివిల్ సప్లై అధికారులు(Civil Supplies officials) మాత్రం ‘తూతూమంత్రం’ చర్యలతో కాలక్షేపం చేస్తున్నారు. గతంలో రెండుసార్లు భారీగా బియ్యం పట్టుబడిన సందర్భాల్లోనూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే, దళారులు మూడోసారి కూడా బరితెగించి వందలాది క్వింటాల బియ్యాన్ని తరలిస్తున్నారు. పట్టుబడిన బియ్యం వివరాలను, నిందితుల నేపథ్యాన్ని గోప్యంగా ఉంచడంలో అధికారుల ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
‘రీ-సైక్లింగ్’ దందా.. అధికారుల అండదండలు?
ప్రజా పంపిణీ బియ్యాన్ని మిల్లులకు తరలించి, గోనె సంచులు మార్చి, తిరిగి ప్రభుత్వానికే ‘లేవీ’ బియ్యంగా విక్రయించే భారీ కుంభకోణం ఇక్కడ సాగుతోంది. ఈ రీ-సైక్లింగ్(Recycling) ప్రక్రియలో అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయనేది బహిరంగ రహస్యం. అసలు ఈ బియ్యం రేషన్ డీలర్ల నుంచి వస్తున్నాయా? లేక లబ్ధిదారుల నుండి దళారులు సేకరిస్తున్నారా? అనే మూలాలను తవ్వడంలో విజిలెన్స్ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది.
ఉన్నతాధికారులు స్పందించేనా?
కేవలం లారీ డ్రైవర్ల మీద, క్లీనర్ల మీద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటే ఈ మాఫియా ఆగదు. మిల్లు యజమానులతో పాటు, దీని వెనుక ఉండి నడిపిస్తున్న ‘పెద్దల’ను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధికారుల లోపాయికారీ ఒప్పందాల వల్లనే ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని, ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Kavitha Political Party: తెలంగాణలో సంచలనం.. కవిత కొత్త పార్టీ షురూ.. ఆ రోజే అధికారిక ప్రకటన?

