Jupally Krishna Rao: పర్యాటక కేంద్రంగా తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పర్యాటకంలో కేరళ రాష్ట్రంతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని, రానున్న రోజుల్లో ఈ రంగం కొత్త పుంతలు తొక్కనుందని వెల్లడించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో సరైన పర్యాటక విధానం లేకపోవడంతో ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు.
పర్యాటక రంగాన్ని బలోపేతం
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు నూతన పర్యాటక విధానాన్ని (2025-2030) తీసుకువచ్చామని ప్రకటించారు. పర్యాటక రంగాన్ని పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేసేందుకు దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా రాయితీలు ఇస్తున్నామని మంత్రి తెలిపారు. టూరిజం కాన్‌క్లేవ్, గ్లోబల్ సమ్మిట్లలో ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని వెల్లడించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఈ రంగం వాటాను పెంచడంతో పాటు, భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు. నిజాం సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సదుపాయాలు, బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ ఏరియాను టూరిజం స్పాట్‌గా మార్చడంతో పాటు, వేములవాడ రాజన్న గుడి చెరువు వద్ద రోప్ వే ఏర్పాటుపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ వంటి వారసత్వ ప్రదేశాలకు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు చేపడుతున్నామని జూపల్లి తెలిపారు. ఇటీవల జరిగిన ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా సుందరీమణులు మన పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చేసి, తెలంగాణ ఘనమైన వారసత్వ సంపదను ప్రపంచానికి చాటి చెప్పామని జూపల్లి గుర్తు చేశారు.
Also Read: Jupally Krishna Rao: మోడీ, అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

