Jupally Krishna Rao: బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయిందని, తమ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే ఆ పార్టీ నేతలు అసెంబ్లీని బహిష్కరించారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పలాయనవాదానికి నిదర్శనం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా ఇతర నీటి పారుదల ప్రాజెక్టుల్లో జరిగిన సాంకేతిక లోపాలు, అక్రమాలపై చర్చించేందుకు సభకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినా.. బీఆర్ఎస్ నేతలు పారిపోవడం వారి పలాయనవాదానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. మైక్ ఇవ్వడం లేదని స్పీకర్‌పై నెపం మోపడం హాస్యాస్పదమని, అసలు చర్చలో పాల్గొంటే కదా మైక్ ఇచ్చేదని ఆయన ఎద్దేవా చేశారు.
Also Read: Jupally Krishna Rao: తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవల అభినందనీయం: మంత్రి జూపల్లి కృష్ణారావు
రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా నీళ్లివ్వలేదు
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పేరుతో గత ప్రభుత్వం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసినా, ఒక్క ఎకరాకు కూడా నీరు అందించలేకపోయారని జూపల్లి ఆరోపించారు. పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, డిండి వంటి ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసి ప్రజలను వంచించారని విమర్శించారు.
కృష్ణా జలాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం
కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని జూపల్లి ధ్వజమెత్తారు. ఈ వాస్తవాలన్నీ అసెంబ్లీలో చర్చకు వస్తే ప్రజలకు ముఖం చూపలేమనే భయంతోనే ‘బహిష్కరణ డ్రామా’ ఆడుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన ధన దోపిడీని ప్రజల ముందు ఉంచడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ రెడ్డి, మెఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Jupally Krishna Rao: మోడీ, అమిత్ షా నియంతృత్వ పాలనను తరిమికొట్టాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

