Illegal Registration: రాష్ట్ర ప్రభుత్వం భూముల అక్రమ విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామాల వారీగా నిషేధిత జాబితాను సర్వే నంబర్లతో సహా సిద్ధం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 10,953 రెవెన్యూ గ్రామాలకు గాను, 10,947 గ్రామాల్లో నిషేధిత భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో 606, మేడ్చల్‌లో 162, వికారాబాద్‌లో 493 గ్రామాల్లో ఇటువంటి భూములు ఉన్నాయని స్పష్టమైంది. ప్రభుత్వం ఈ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయి అధికారులు మాత్రం సహకరించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల చట్టం సెక్షన్ 22A కింద నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ, అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో ఈ భూములను గుర్తించే అవకాశం లభించినా, క్షేత్రస్థాయి అధికారుల పాత పద్ధతులు మారడం లేదని ప్రచారం సాగుతోంది. ఈ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొంతమంది అధికారులు ఆయా నియోజకవర్గాల్లో పని చేయడానికి కూడా వెనుకాడటం గమనార్హం.
నిషేధిత జాబితాలో ఏమున్నాయి?
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ చట్టం ప్రకారం ఏయే భూములు నిషేధిత జాబితాలోకి వస్తాయనే అంశంపై స్పష్టతనిచ్చింది. ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు, భూ గరిష్ట పరిమితి భూములు, భూదాన్, వక్ఫ్ బోర్డు, ఎండోమెంట్ భూములతో పాటు ఈడీ, సీఐడీ, ఏసీబీ వంటి దర్యాప్తు సంస్థలు అటాచ్ చేసిన ఆస్తులను కూడా ఈ జాబితాలో చేర్చారు. 2007 నుంచి అమలులో ఉన్న ఈ 22A నిబంధనలను గత ప్రభుత్వ హయాంలో అధికారులు బేఖాతరు చేస్తూ అనేక భూముల క్రయవిక్రయాలకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం రూపొందించిన కొత్త జాబితాలో కూడా కొన్ని ప్రభుత్వ సర్వే నంబర్లకు మినహాయింపునిచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలోని కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లోని నిషేధిత భూములకు విముక్తి కల్పించినట్లు తెలుస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పసుమాముల, కోహెడ, అనాజీపూర్ వంటి ప్రాంతాల్లోని విలువైన భూములను స్థానిక అధికార పార్టీ నేతల ఒత్తిడితో జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం.
తప్పుడు పత్రాలతో అనుమతులు
ప్రభుత్వ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం వెనుక గత ప్రభుత్వ తప్పిదాలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. అప్పట్లో అడ్డగోలుగా జారీ చేసిన ఎన్‌వోసీలు, ఓఆర్‌సీలను వినియోగించి ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాదార్లను సృష్టించారు. ఆ తప్పుడు పత్రాలను చూపి హెచ్‌ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాల నుంచి వెంచర్లకు అనుమతులు పొంది, నిషేధిత భూములను యథేచ్ఛగా అమ్ముకున్నారు. గతంలో బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వంలోనైనా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోతాయని సామాన్యులు ఆశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదని తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేతలతో అక్రమార్కులు చేతులు కలపడంతో పాత అక్రమాలే కొత్త రూపంలో సాగుతున్నాయి. రికార్డుల్లో నిషేధిత జాబితా అని ఉన్నప్పటికీ, కబ్జాదారులు క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెడుతున్నారు.
సబ్ రిజిస్ట్రార్ల తీరుపై విమర్శలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలువురు సబ్ రిజిస్ట్రార్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్లు లేఅవుట్ నిర్వాహకులతో కుమ్మక్కై రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఆర్డీవోలు ఇచ్చిన తప్పుడు పత్రాలను అడ్డం పెట్టుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ఉన్నతాధికారులు విచారణ చేపట్టకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

