Illegal Land Registration: ప్రభుత్వాలు మారినా అధికారుల తీరు మారడం లేదని, ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ల వ్యవస్థలో అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ స్థలాల డాక్యుమెంట్లను పాత విధానాల్లోనే, ఎలాంటి ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలోనే, రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో రూ. 40 కోట్ల విలువైన ప్రభుత్వ పార్కు స్థలం అక్రమ రిజిస్ట్రేషన్లకు గురైన ఘటన సంచలనం సృష్టిస్తుంది.
బై నెంబర్లతో నాలుగు డాక్యుమెంట్ల సృష్టి..
రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్ మండలం, సాహెచ్ నగర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 200లో 1967 సంవత్సరంలో శ్రీపురం కాలనీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బీఎన్ రెడ్డి(MN Reddy) నగర్ డివిజన్ పరిధిలో ఉన్న ఈ కాలనీలో సుమారు 5,000 గజాల స్థలంలో శ్రీ ఛత్రపతి శివాజీ పార్కు ఉంది. అయితే, ఇటీవల కొందరు వ్యక్తులు, మొదట లేఅవుట్ చేసిన వారి వారసుల పేర్లతో బై నెంబర్లను ఉపయోగించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను సృష్టించారు. వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎలాంటి లీగల్ ఎయిర్ లేదా డెత్ సర్టిఫికెట్ వంటి ఆధారాలు లేకుండానే ఈ రిజిస్ట్రేషన్లు జరగడం విడ్డూరంగా ఉంది. 58 ఏళ్ల కిందటి లేఅవుట్‌కు మొదటి రిజిస్ట్రేషన్ చేసే ముందు అధికారికి అనుమానం ఎందుకు రాలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో ప్లాట్ పోజిషన్ ఫొటోను కూడా జత చేయకుండా డాక్యుమెంట్ చేయడం విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తుంది.
కోట్లు విలువ చేసే స్థలం అన్యాక్రాంతం..
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని సాగర్ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఈ శ్రీ ఛత్రపతి శివాజీ పార్కు(Chhatrapati Shivaji Park) స్థలం అన్యాక్రాంతమవుతుంది. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈ పార్కును కాలనీ వాసుల కండ్లు కప్పి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. రూ. కోటి ఖర్చుతో పార్కులో ఓపెన్ జీమ్, వాకింగ్ ట్రాక్, ప్రహరీగోడ, శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. కాలనీలో గజం ధర రూ. 80 వేలు పలుకుతుండగా, 5,000 గజాల ఈ స్థలం విలువ సుమారు రూ. 40 కోట్లు ఉంటుంది. ఈ స్థలాన్ని 4 డాక్యుమెంట్లుగా చేసుకొని విక్రయించాలని అక్రమార్కులు ప్రణాళికలు వేశారు. ఈ డాక్యుమెంట్ల సృష్టిలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.
పబ్లిక్ ప్రాపర్టీని కాపాడాలి..
ఎన్నో సంవత్సరాల క్రితం లేవుట్‌లో పార్కు స్థలంగా గుర్తించబడిన ఈ ప్రదేశం 100% పబ్లిక్ ప్రాపర్టీ. ఆధారాలు లేకుండా నాలుగు డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు, వారికి సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేయాలి. సబ్-రిజిస్ట్రార్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఈ విషయంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minester Ponguleti Srinivas Reddy)కి ఫిర్యాదు చేశాం. మంత్రి స్పందించి సంబంధిత అధికారులకు విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారని కార్పోరేటర్ లచ్చరెడ్డి తెలిపారు.
Also Read: Mahesh Kumar Goud: బీజేపీ మతవాద శక్తులకు బుద్ధి చెప్పాలి.. పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
