Koti Firing Updates: హైదరాబాద్ లోని కోఠి ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్దకు వచ్చిన రిన్షద్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపి దుండగులు రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. స్థానిక ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు బాధితుడు వచ్చాడు. ఈ క్రమంలో అతడ్ని వెంబడిస్తూ వెనుకే వచ్చిన ఇద్దరు దుండగులు అతడి కాలిపై కాల్పులు జరిపి.. డబ్బుతో అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
పోలీసులకు సవాల్ గా మారిన కేసు
ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద స్థానికులు చూస్తుండగానే గన్ తో నిందితులు కాల్పులు జరిపారు. బ్లాక్ కలర్ స్కూటీపై వచ్చి రిన్షద్ పై కాల్పులు జరిపినట్లు స్థానికులు తెలిపారు. ఇది తెలిసిన వాళ్ల పనేనా? రిన్షద్ ఉదయం 7 గంటలకే వస్తాడని దుండగులకు ముందే తెలుసా? నగదు డిపాజిట్ చేసే సమయం, పారిపోయేందుకు రూట్ మ్యాప్ ముందే సిద్ధం చేసుకున్నారా? నిందితులు ముందే రెక్కీ నిర్వహించారా? అనే ప్రశ్నలు పోలీసులకు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆయా కోణాల్లో వారు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
వెలుగులోకి సీసీటీవీ ఫుటేజీ..
మరోవైపు కోఠి కాల్పుల ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వీడియోను గమనిస్తే.. బాధితుడు రిన్షద్ స్కూటీ దిగేలోగా అతన్ని ఇద్దరు వ్యక్తులు చుట్టుముట్టారు. ముందుగా బెదిరించి క్యాష్ తీసుకునే ప్రయత్నం చేశారు. బాధితుడు ప్రతిఘటించడంతో క్యాష్ లాక్కొని అతడి కాలిపై కాల్పులు జరిపారు. అనంతరం బాధితుడి స్కూటీనే తీసుకొని ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. దర్యాప్తులో భాగంగా నాంపల్లి – కోఠి మధ్య వందల సీసీటీవీ ఫుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. నగర శివార్లలో తనిఖీలు ముమ్మరం చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి.
కోఠి కాల్పుల ఘటనలో వెలుగులోకి సీసీటీవీ ఫుటేజ్
బాధితుడు రిన్షద్ స్కూటీ దిగేలోగా అతన్ని చుట్టుముట్టిన ఇద్దరు వ్యక్తులు
ముందుగా బెదిరించి క్యాష్ తీసుకునే ప్రయత్నం
రిన్షద్ ప్రతిఘటించడంతో క్యాష్ తీసుకుని
గన్ తో కాలిపై కాల్పులుబాధితుడు స్కూటీపైనే పారిపోయిన నిందితులు… https://t.co/s1k4nAKsx4 pic.twitter.com/QZXWzk52Pq
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026
Also Read: Municipal Elections: మున్సిపల్ నోటిఫికేషన్ తో పార్టీలు అన్ని అలర్ట్.. ప్రచారంలో జోరు పెంచిన వార్డు కౌన్సిలర్లు!
రైల్వే స్టేషన్ వద్ద బైక్ గుర్తింపు..
మరోవైపు కాల్పుల ఘటనా స్థలంలో రెండోసారి క్లూస్ టీమ్ తనిఖీలు చేసింది. పోలీసు వర్గాల ప్రకారం రిన్షద్ పై రెండుసార్లు దుండగులు కాల్పులు జరిపారు. ఘటనా స్థలిలో రెండు బుల్లెట్ షెల్స్ ను అధికారులు గుర్తించారు. రిన్షద్ కుడి కాలులోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లగా.. మరొకటి కనిపించలేదు. మరోవైపు నిందితులు కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. స్టేషన్ వద్ద వారు వదిలేసిన రిన్షద్ బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

