Harichandana Dasari: వ్యాధిపై అవగాహన కల్పించినపుడు కుష్టి వ్యాధి నిర్మూలన సాధ్యమని, ఇందుకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి (Harichandana Dasari )అధికారులకు సూచించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా లంగర్ హౌజ్ బాపుఘాట్ లో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కుష్టు వ్యాధి నిర్మూలన పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ ఎవరికైనా చర్మంపై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి, వాటిని తాకినప్పుడు లేదా దానిమీద నొప్పి కలిగించి నప్పుడు తెలియకపోతే వారు సమీప ఆస్పత్రి వైద్యులను సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకుని తగిన చికిత్స పొందాలన్నారు.
అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ద చూపాలి
కుష్ఠువ్యాధిగ్రస్తులను, కుష్ఠు వ్యాధి కారణంగా అంగవైకల్యం ఏర్పడిన వారి పట్ల శ్రద్ద చూపాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి చికిత్స అందుబాటులోకి ఉందని తెలిపారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులను స్వంత కుటుంబ సభ్యులుగా భావించి ఎలాంటి వివక్ష చూపకుండా ఉండాలన్నారు. కుష్ఠు వ్యాధి ఒక బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యాధి అని, ఎండీటీ చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధి పూర్తిగా నయమవుతుందని, సత్వర చికిత్స ద్వారా కుష్టువ్యాధి మూలంగా వచ్చే అంగవైకల్యం రాకుండా నివారించవచ్చనని వివరించారు.
అందరం కలిసి కృషి చేయాలి
మహాత్మాగాంధీ కలలు కన్న విధంగా భవిష్యత్తులో కుష్టువ్యాధి రహిత భారతదేశ నిర్మాణంలో అందరం కలిసి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వైద్యాధికారులు ఏఎన్ఎంలు, సిబ్బంది ఉద్యోగులతో కలిసి గాంధీ విగ్రహం వద్ద వైద్యాధికారులతో కలిసి కలెక్టర్ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యాధికారి డాక్టర్ వెంకటి, ఆర్డీఓ రామకృష్ణ, అదనపు జిల్లా వైద్యాధికారులు, డాక్టర్ సరస్వతి, డాక్టర్ మురళీధర్ రావు వైద్య సిబ్బంది వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Hari Chandana Dasari: తెలంగాణ అభివృద్ధిలో యువత ముందుండాలి : కలెక్టర్ హరిచందన దాసరి!

