Harichandana Dasari: హైదరాబాద్ జిల్లాలోని అన్ని బస్తీ దవాఖానాలలో వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి (Harichandana Dasari) వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం బోరబండ వినాయక నగర్ బస్తీ దవాఖాన ను ఆమె పరిశీలించి ఓపీపీ విభాగం, మెడికల్ స్టాఫ్ వివరాలు, మందుల నిల్వలు, ప్రభుత్వం ద్వారా అందించే 57 రకాల ల్యాబ్ టెస్టులను వైద్యాధికారులతో అడిగి తెల్సుకున్నారు.
వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఆ దిశగా బస్తీ దవాఖానాకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ సూచించారు. హైదరాబాద్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 169 బస్తీ దవఖానాలలో ఈ నెల 29, 30 తేదీలలో జిల్లా అధికారులు తనిఖీలు నిర్వహించి, ఆసుపత్రిలో సౌకర్యాలపై నివేదికలు అందించాలని ఆదేశించారని తెలిపారు.
145పై గా ఆసుపత్రులు
మంత్రి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఇప్పటివరకు 145పై గా ఆసుపత్రులు పరిశీలించి నివేదికలు అందించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. తదుపరి దవాఖానలో పేషెంట్లతో కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో టెస్టులు అనంతరం బీపీ, షుగర్ తదితర చికిత్సలకు మందులు అందుతున్నాయని పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ఓపీ విధానం, మెడిసిన్ రిజిస్టర్లు, డాక్టర్స్ హాజరు పట్టికలను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి, కార్పొరేటర్ హబీబాసుల్తానా, వైద్యాధికారులు డాక్టర్ మహబూబ్ సుభాన్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ ప్రియాంక బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

