Aliabad Municipality: అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గడి మలక్పేట్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తోటకూర వజ్రేష్ యాదవ్ టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ కలిసి మాట్లాడారు మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 68 కౌన్సిలర్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంటుందని అన్నారు. కొన్ని చోట్ల ఉన్న చిన్న సమస్యలను పరిష్కరించి అందరికీ బీ ఫామ్లు ఇస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గెలిచి రెండేళ్లు గడిచినా నియోజకవర్గానికి రూపాయి కూడా తీసుకురాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధే తప్ప, ఎమ్మెల్యే, ఎంపీలు ప్రజల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.
హామీలు ప్రభుత్వం అమలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా ప్రజలకు అందిస్తుందని సుధీర్ రెడ్డి(Sudeer Reddy) తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేస్తున్నామని అన్నారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి పథకాలు మేనిఫెస్టోలో లేనప్పటికీ అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని హరివర్ధన్ రెడ్డి అన్నారు. అప్పులపాలైన రాష్ట్రంలో వడ్డీలు చెల్లిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి(MLA Malla Reddy) అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.
Also Read: Bhatti Vikramarka: మొగిలిగిద్ద ఉన్నత పాఠశాల వార్షికోత్సవాల్లో భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు..?
మూడు మున్సిపల్ కాంగ్రెస్ కైవసం: నక్క ప్రభాకర్ గౌడ్
మూడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని నక్క ప్రభాకర్ గౌడ్(Prabakar Goud) తెలిపారు. అలియాబాద్ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 17 వార్డులు గెలుస్తామని చెప్పారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీలో 24 వార్డుల్లో 18 నుంచి 19 వార్డులు, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డుల్లో 17 నుంచి 18 వార్డులు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంజి రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు ముజీబుద్దీన్, మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read: Hydraa: కొన్న భూమిని కాదని పక్కనున్న భూమి కబ్జా.. హైడ్రా ఎంట్రీతో మ్యాటర్ క్లియర్..?

