Ibomma Ravi: తెలుగు సినిమా పరిశ్రమలో పైరసీకి పెట్టింది పేరైన ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఐబొమ్మ రవి (Ibomma Ravi) జీవితంపై సినిమా రాబోతోంది. ఈ మధ్యే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అరెస్ట్ అయిన రవి జీవితకథపై సినిమా తీయనున్నట్లుగా ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ అనే నిర్మాణ సంస్థ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన సినీ వర్గాల్లో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రవి అరెస్ట్ చుట్టూ ఉన్న కాంట్రవర్సీని, అతని వ్యక్తిగత జీవితంలోని ట్విస్ట్‌లను సినిమాగా మలచడానికి నిర్మాణ సంస్థ ప్రయత్నించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా, గతంలో సంచలన వ్యక్తులు, వివాదాస్పద అంశాలపై వరుసగా సినిమాలు ప్రకటిస్తూ కాంట్రవర్సీని సొమ్ము చేసుకునేవారుగా పేరుగాంచిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరహాలో ఈ సంస్థ కూడా వ్యవహరిస్తోందని నెటిజన్లు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. ‘వీడెవడో వర్మకు బ్రదర్‌లా ఉన్నాడే!’ అంటూ ‘తేజ్ క్రియేటివ్ వర్క్స్’ (Tej Creative Works)పై సెటైర్లు వేస్తున్నారు. (Ibomma Ravi Biopic)
Also Read- Bigg Boss Telugu 9: హౌస్‌మేట్స్‌ని ఏడిపిస్తున్న బిగ్ బాస్.. రీతూపై పవన్ ఫ్యామిలీ ప్రేమ చూశారా?
రవి చీకటి కోణాన్ని చూపించేలా..
ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో… ఐబొమ్మ రవి జీవితంలోని వాస్తవాలు (Facts), తన పైరసీ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ఆయన చేసిన పోరాటం, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న వెన్నుపోట్లు, అతని టీమ్‌కు సంబంధించి ప్రపంచానికి తెలియని చీకటి కోణాలను వెండితెరపై చూపించబోతున్నట్లుగా స్పష్టం చేసింది. వెబ్‌డిజైన్‌లో పట్టు ఉన్న సాధారణ వ్యక్తిగా మొదలై, అక్రమ సంపాదనకు దారితీసిన అతని మానసిక వేదన, అవమానాలు (ముఖ్యంగా భార్య, అత్తామామల నుండి) వంటి వ్యక్తిగత అంశాలు కూడా ఈ కథలో ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు, లక్షలాది మంది సినీ కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిన పైరసీ కింగ్‌పై సినిమా తీయడం ద్వారా, అతడిని ఒక హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ అంశాన్ని వివాదాల దృష్టికోణం నుంచే చూసి, త్వరగా క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఈ సంస్థ ఉన్నట్లుగా.. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి కామెంట్స్ మొదలయ్యాయి.
Also Read- Manchu Lakshmi: ఆ పని చేయకపోతే మహేష్, నమ్రతలను కొడతా.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
రవికి పెరుగుతున్న మద్దతు
మరోవైపు ఐబొమ్మ రవి అరెస్ట్, సినిమా ప్రకటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు నష్టం కలిగించిన ఒక వ్యక్తి కథను సినిమాగా మార్చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సినిమా ప్రకటన తెలుగు సినీ వర్గాల్లో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్చకు దారి తీస్తుందో చూడాలి. అలాగే అతని అరెస్ట్‌ను ఉద్దేశించి కొందరు సోషల్ మీడియాలో సపోర్టివ్‌గా కామెంట్స్ చేస్తుండటం విడ్డూరమనే చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో మద్దతు బాగా పెరుగుతోంది. సామాన్యుడికి సినిమా అందేలా చేశాడని, సినిమా వాళ్లు ఇష్టం వచ్చినట్లుగా రేట్లు పెంచుకుంటూ పోతుంటే.. సామాన్యుడుకి మిగిలేది ఇదేనంటూ.. కొందరు పోస్ట్‌లు పెడుతుండటం గమనించవచ్చు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
