Telangana Budget: తెలంగాణ స్టేట్ బడ్జెట్ రూపకల్పన ప్రాసెస్ మొదలైంది. అన్ని శాఖల్లో బడ్జెట్ హడావుడి నెలకొన్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆధారంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. దీంతో అధికారులు బడ్జెట్ ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు. అనవసర అంశాలను బడ్జెట్ ప్రతిపాదనల్లో క్రోడీకరించవద్దని ప్రభుత్వం నుంచి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో వాస్తవీకరణ బడ్జెట్ ప్రిపరేషన్ కోసం కసరత్తు చేస్తున్నారు. త్వరలో సీఎస్ ఆధ్వర్యంలో ప్రీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ముఖ్య కార్యదర్శుల అనంతరం, విభాగాల వారీగా హెచ్‌వోడీలతోనూ రివ్యూ నిర్వహించాలని సీఎస్, ఫైనాన్స్ సెక్రెటరీలు భావిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని శాఖల విభాగాధిపతులకు సమాచారం ఇచ్చారు. సంక్రాంతి పండుగ తర్వాత ఈ మీటింగ్‌లు నిర్వహిస్తామని సెక్రటేరియట్‌లోని ఓ అధికారి తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌పై ఫోకస్.. ఆ తర్వాత..
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నది. ఇప్పటికే ప్రీ బడ్జెట్ సమావేశం కూడా పూర్తయింది. కేంద్ర బడ్జెట్ బ్రీఫింగ్ కాపీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)కు చేరింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర బడ్జెట్‌కు సన్నహాలు చేయనున్నారు. కేంద్ర శాఖలు, రాష్ట్ర శాఖలను అనుసంధానిస్తూ ఆయా శాఖల తరఫున బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయింపులు ఉండాలనేది త్వరలో జరిగే రివ్యూ మీటింగ్‌లలో తేల్చనున్నారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖ నుంచి రూ.20 వేల కోట్లు, ఇండస్ట్రీ నుంచి దాదాపు రూ.లక్ష కోట్లతో ప్రపోజల్స్ సిద్ధమైనట్లు తెలిసింది. విద్యా శాఖకూ సుమారు రూ.30 వేల కోట్లతో ప్రతిపాదన పెట్టనున్నట్లు సమాచారం. ఎస్సీ(SC), ఎస్టీ(ST), బీసీ(BC), మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి దాదాపు రూ.80 వేల కోట్లతో బడ్జెట్ ప్రపోజల్ పెట్టనున్నట్లు తెలిసింది. ఇలా అన్ని శాఖల ప్రతిపాదనలను ప్రభుత్వానికి ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఫైనాన్స్ శాఖ, క్యాబినెట్ సమన్వయంతో బడ్జెట్‌ను ఫైనల్ చేస్తుంది.
Also Read: Chiranjeevi Movie: మెగాస్టార్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రీమియర్ ఎంతంటే?
అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఇరిగేషన్‌కు ప్రయారిటీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. తొలి రెండేళ్ల పాటు అభివృద్ధి, సంక్షేమంతో పాటు వ్యవసాయానికి ప్రయారిటీ ఇచ్చారు. ఈసారి బడ్జెట్‌లో ఇరిగేషన్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిసింది. పెండింగ్ ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించేలా బడ్జెట్ కాపీ ప్రిపేర్ కానున్నది. అలాగే, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు కూడా ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఏఐ టెక్నాలజీ, ఐటీ, ఇండస్ట్రీలకూ ప్రాధాన్యతా క్రమంలో నిధులు కేటాయించేందుకు సర్కార్ సుముఖంగా ఉన్నది. అంతేగాక ఇటీవల సర్పంచ్‌లు బాధ్యతలు తీసుకున్నారు. వీరి ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా పంచాయితీ రాజ్ శాఖకూ గతంలో పోల్చితే అధిక నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం వెయిట్ చేయకుండా గ్రామాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని భావిస్తున్నది. తద్వారా పదేళ్ల పవర్ నినాదానికి మైలేజ్ అవుతుందని ఆలోచిస్తున్నది.
గత రెండు ఆర్థిక సంవత్సరాల బడ్జెట్.. ముఖ్య శాఖలకు కేటాయింపులు
2024-25 బడ్జెట్
మొత్తం వ్యయం : రూ.2,91,159 కోట్లు
రెవెన్యూ వ్యయం : రూ2,20,945 కోట్లు
వ్యవసాయం : రూ.72,659 కోట్లు(రైతు రుణమాఫీకి భారీగా నిధులు)
ఆరు గ్యారెంటీలు : సుమారు రూ.53,196 కోట్లు
సంక్షేమం : రూ.40,000 కోట్లు
2025-26 బడ్జెట్
బడ్జెట్ అంచనా: రూ.3,04,965 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.2,26,982 కోట్లు
ఎస్సీ/ఎస్టీ సంక్షేమం: రూ.57,401 కోట్లు
విద్యా శాఖ: రూ.23,108 కోట్లు
రైతు భరోసా: రూ.18,000 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు: రూ.12,751 కోట్లు.

