BJP Telangana: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఒవైపు కమలం పార్టీ అగ్రనాయకత్వం ప్రకటనలు గుప్పిస్తుంటే.. క్షేత్రస్థాయిలో రాష్ట్ర నేతల తీరు అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్ర కమిటీలో పదవులు అనుభవిస్తున్న నేతలు ప్రజల్లోకి వెళ్లడం కంటే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి చుట్టూ ప్రదక్షిణలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర కమిటీ బాధ్యులతో పాటు వివిధ మోర్చాలకు చెందిన నేతలు సైతం బాధ్యతలను పంచుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడం, ప్రజా సమస్యలపై పోరాడటం కంటే రాష్ట్ర కార్యాలయానికే పరిమితమవుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోకుండా కేవలం మీడియా ఎదుట కనిపించడమే రాజకీయమని కొందరు భ్రమపడుతున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతున్నది.
సొంత నియోజకవర్గాల్లో పట్టు లేకపోవడం
రాష్ట్రస్థాయి పదవుల్లో, వివిధ మోర్చాల్లో ఉన్నప్పటికీ, చాలా మంది నాయకులకు తమ సొంత నియోజకవర్గాల్లో పట్టు లేకపోవడం గమనార్హం. కనీసం సొంత సెగ్మెంట్‌లో పార్టీని బలోపేతం చేయలేని దుస్థితిలో కొందరు సభ్యులు ఉండటం పార్టీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తథ్యమని కాషాయ పార్టీ చెబుతున్నది. కానీ, అందుకు అనుగుణంగా రాష్ట్ర కార్యవర్గం ఏమాత్రం ముందడుగు వేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడే ఎందుకులే అని పలువురు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అప్పుడు చూసుకుందాంలే అనే నిర్లక్ష్య ధోరణి మరికొందరిలో కనిపిస్తున్నదని తెలుస్తున్నది. వివిధ విభాగాలకు ప్రాతినిధ్యం వహించే మోర్చా అధ్యక్షుల పరిస్థితి కూడా ఇలాగే ఉండటం గమనార్హం. కేవలం రాష్ట్ర అధ్యక్షుడి చుట్టూ తిరుగుతూ, ఆయన మెప్పు పొందేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాల వారీగా పర్యటనలు చేసి మోర్చాలను యాక్టివేట్ చేయాల్సింది పోయి స్టేట్ ఆఫీస్ క్యాబిన్లకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Minister Komatireddy: నన్ను ఏమైనా అనండి.. మహిళా అధికారిపై రాతలు బాధాకరం.. నోరువిప్పిన మంత్రి కోమటి
ఫొటోలకు ఫోజులివ్వడమే పరమావధిగా..
ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వంపై పోరాడాల్సిన నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడి పక్కన ఫొటోలకు ఫోజులు ఇవ్వడమే పరమావధిగా భావిస్తున్నారు. ఇలాంటి నత్తనడక ధోరణి కొనసాగితే, వచ్చే ఎన్నికల నాటికి కేడర్‌ను సమాయత్తం చేయడం కష్టమనే ఆందోళన నిజమైన కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నది. కమలం పార్టీలో నేతలంతా నత్తల్లా మారితే పరిగెత్తేదెలా? అనే ప్రశ్నలు శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నది. రాష్ట్ర నాయకత్వం చేపట్టిన పనిని పంచుకోకపోవడం పక్కన పెడితే కనీసం సొంత సెగ్మెంట్‌లో గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్ర కమిటీ సభ్యులు స్టేట్ వైడ్‌గా ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉండాల్సింది పోయి, కనీసం సొంత సెగ్మెంట్‌లో కూడా ప్రభావితం చేయగలిగే స్థాయిలోనూ లేకపోవడం గమనార్హం. రాష్ట్ర కమిటీ, వివిధ మోర్చాల ప్రతినిధులకు సొంత గడ్డపై కనీసం 20 వార్డులపై అయినా పట్టుందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. జనం మధ్య ఉండకుండా కేవలం ఫ్లెక్సీలకే పరిమితం అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. కమలం పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఉన్న భారాన్ని పంచుకుని మోస్తారనుకుంటే ఆ ప్రతినిధులే భారమయ్యా రనే పరిస్థితికి తెచ్చుకున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో చిక్కడపల్లిలో ధర్నా చేస్తే పట్టుమని 100 మంది కూడా లేకపోవడం దీనికి నిదర్శనంగా మారింది. మరి ఈ నేతల తీరు ఇప్పటికైనా మారుతుందా? ఇకనైనా నిద్ర వీడి ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

