Jana Sena: తెలంగాణ అతిత్వరలోనే మునిసిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, రిజర్వేషన్లు వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో, మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పక్కా వ్యూహాలను సిద్ధం చేసుకోగా, ప్రధాన విపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ కూడా అదే స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే, అనూహ్య రీతిలో ఈ పార్టీలతో పాటు ఈసారి జనసేన పార్టీ (Jana Sena) కూడా మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు పార్టీ నిర్ణయించింది. శనివారం నాడు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.
పోటీ చేయాలని నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ప్రకటనలో జనసేన పార్టీ పేర్కొంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కమిటీలు ఏర్పాటు చేస్తామని, ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపింది. ఈ మేరకు జనసేన రాష్ట్ర కార్యదర్శి రామ్ తుల్లారి ప్రకటన చేశారు.
ప్రకటనలో ఏముంది?
‘‘తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి జనసేన సిద్ధం. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధం అవుతోంది. తెలంగాణలో ప్రజల పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో జనసేన పార్టీ కార్యాచరణను ప్రారంభించింది. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ, సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, యువత, మహిళలు, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం, స్థానిక సమస్యలపై పరిష్కరించే సమర్థవంతులను ముందుకు తీసుకురావడం లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ ఎన్నికల ప్రచారంలో పట్టణాల్లో పార్టీ బలోపేతం దిశగా పనిచేసిన జనసైనికులు, వీర మహిళలు చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి తోడ్పడాలని పిలుపునిస్తున్నాం’’ అని ప్రకటనలో జనసేన పేర్కొంది.
Read Also- Vidyut Jammwal: నగ్నంగా చెట్టు ఎక్కిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్.. నెటిజన్లు ఏం చేశారంటే?

