Minister Komatireddy: రెండు రోజులక్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై (Minister Komatireddy) దుష్ప్రచారం జరిగింది. ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిని ఉద్దేశపూర్వకంగానే ఆయన ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారని, ఇద్దరి మధ్య ఏదో ఉందన్నట్టుగా అనుమానం కలిగేలా ఫేక్ కథనాలను వండివార్చారు. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ దుష్ప్రచారంపై మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి శనివారం (జనవరి 10) స్పందించారు. తప్పుడు ప్రచారంతో ఇబ్బందిపెట్టే బదులు, ఇంత విషం ఇచ్చి చంపాలని భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. కోపం తీరకుంటే విషమిచ్చి చంపాలని వ్యాఖ్యానించారు. తనను ఏమైనా అనండి, ఏదైనా రాయండి, కానీ మహిళా అధికారిపై ఇష్టం వచ్చిన రీతిలో రాతలు రాసి ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కాలేరని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, తప్పు చేసినవారిని దేవుడు చూసుకుంటాడని ఆయన అన్నారు. పాలిటిక్స్‌లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనని, కానీ ఈ విధంగా వ్యక్తిగత పరువుకు భంగం కలిగించకూడదని పేర్కొన్నారు.
Read Also- Mahabubabad SP: మహిళల రక్షణ, భద్రత కోసమే షీ టీంలు పని చేస్తున్నాయి : ఎస్పీ శబరీష్!
బతకు మీద పెద్దగా ఆశ లేదు
బతుకు మీద తనకు పెద్దగా ఆశలు లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొడుకు చనిపోయినప్పుడే తాను సగం చనిపోయానని, తన కుమారుడి పేరిట సేవా కార్యక్రమాలు చేశానని, చేస్తూనే ఉన్నానని మంత్రి ప్రస్తావించారు. ‘‘మీకు కూడా ఇంట్లో కుటుంబాలు ఉంటాయి కదా?’’ అని మంత్రి ప్రశ్నించారు. ఆరోపణల వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నానని తెలిపారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేశానని, అద్దె ఇంట్లో ఉండి ప్రజలకు సేవ చేశానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుర్తుచేసుకున్నారు. దయచేసి తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏది పడితే అదే రాస్తాం అంటే పైన ఆ దేవుడు చూసుకుంటాడని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.
సినిమా టికెట్ రేట్ల పెంపుతో నాకు సంబంధం లేదు
బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కోటమిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సినిమా టికెట్ రేట్ల పెంపు వ్యవహారంపై ఆయన మాట్లాడారు. సినిమా టికెట్ రేట్ల పెంపు విషయం తనకు తెలియదని అన్నారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత, టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలకు సంబంధించి తన దగ్గరకు రావొద్దని చెప్పానంటూ ఆయన గుర్తుచేశారు. ఒక మహిళ చనిపోవడంతో ఎందుకు అనుమతి ఇచ్చానా అని బాధపడ్డానని ఆయన వెల్లడించారు. తొక్కిసలాటలో గాయపడిన బాలుడికి ప్రతిక్ ఫౌండేషన్ నుంచి రూ.25 లక్షల చెక్ అందజేశానని, ఆ బాబుకి అన్ని విధాల అండగా ఉంటానని మంత్రి కోమటి రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

