Nizamabad district Crime: నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బోర్గాంలో జరిగిన పల్లటి రమేష్ (Pallati Ramesh) హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో భార్య సౌమ్యనే ప్రియుడితో కలిసి రమేష్ ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధంతో పాటు రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బును కాజేయాలని భార్య, ఆమె ప్రియుడు పథకం పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆపై వచ్చిన డబ్బుతో పారిపోవాలని వారిద్దరు స్కెచ్ వేసినట్లు తాజాగా బయటపడింది.
గుండెపోటు నాటకం
తొలుత భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చిన సౌమ్య.. రమేష్ నిద్రలోకి జారుకున్న అనంతరం గొంతునులిమి హత్య చేసింది. తనపై అనుమానం రాకుండా సాధారణ మరణంగా దానిని చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గుండెపోటుకు గురై రమేష్ మరణించినట్లు కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే సౌమ్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన మరణం వెనకున్న నిజా నిజాలను వెలికి తీయాలని పోలీసులను కోరారు.
తమ్ముడి ఫిర్యాదుతో..
ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు.. రమేష్ అనుమానస్పద మృతిపై విచారణ ప్రారంభించారు. రమేష్ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఈ క్రమంలోనే రమేష్ గొంతును నులిమి చంపినట్లు పోస్టుమార్టంలో నిర్ధరణ అయ్యింది. దీంతో భార్య సౌమ్యను అదుపులోకి తమదైన శైలిలో విచారించగా.. భార్య సౌమ్య జరిగినదంతా పూసగొచ్చినట్లు పోలీసులకు వివరించింది. ప్రియుడు దిలీప్ తో ఉన్న అక్రమ సంబంధంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బును నొక్కేసేందుకు భర్తను చంపినట్లు ఆమె అంగీకరించింది. దీంతో సౌమ్యతో పాటు ఆమె ప్రియుడు దిలీప్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Also Read: Viral Video: దొంగతనానికి వెళ్లి.. రంధ్రంలో ఇరుక్కుపోయాడు.. ఈ దొంగ టైమ్ అస్సలు బాలేదు!
మెదక్ జిల్లాలోనూ ఇలాగే..
మెదక్ జిల్లా శివంపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలోనూ ప్రియుడితో కలిసి భర్త స్వామి (35)ని భార్య మౌనిక (28) హత్య చేసింది. అంతటితో ఆగకుండా ఈ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు డ్రామాలకు తెరలేపింది. మద్యం మత్తులో చెరువులో పడి భర్త చనిపోయినట్లు బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే స్వామి మృతిపై అనుమానాలు వ్యక్తి చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మెదక్ జిల్లా పోలీసులు అసలు నిజాలను బయటపెట్టారు.

