Viral News: మనుషుల ప్రాణాలను కాపాడటంలో అంబులెన్స్‌లు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రమాద స్థలికి హుటాహుటీనా చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలిస్తుంటాయి. అయితే నగరాల్లో ఉండే ట్రాఫిక్ సమస్య కారణంగా అంబులెన్స్ లు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాల రద్దీ కారణంగా పేషెంట్లను సకాలంలో ఆస్పత్రికి తరలించలేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అలాగే మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో సరైన రోడ్డు మార్గం లేక అంబులెన్స్ రాకపోకలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీనిని గుర్తించిన అసోం ప్రభుత్వం.. బైక్ అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇవి నెట్టింట ఆసక్తికర చర్చకు కారణమైంది.
వీడియోలో ఏముందంటే?
అసోంలోని ఉదల్గురి జిల్లాలో గల బైక్ అంబులెన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఐడియా బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. వైరల్ వీడియోను గమనిస్తే ఓ బైక్ కు గాయపడ్డ పేషెంట్ ను తరలించేందుకు వీలుగా ఒక అంబులెన్స్ సెటప్ ను ఏర్పాటు చేశారు. అందులో ఒక బెడ్ ను అమర్చారు. ఓ వ్యక్తి బైక్ అంబులెన్స్ లో పడుకొని అది ఏ విధంగా వర్క్ చేస్తుందో చూపించడం వీడియోలో గమనించవచ్చు. ఒక పేషెంట్ ను మాత్రమే తరలించేందుకు ఈ బైక్ అంబులెన్స్ లో వీలుంటుంది.
Assam has rolled out bike ambulances to improve emergency response times, especially in congested areas and remote regions where conventional ambulances may face delays. pic.twitter.com/41iH2vb1dO
— Medical Dialogues (@medicaldialogs) January 6, 2026
మారుమూల గ్రామాలే లక్ష్యం
ఎత్తైన కొండలు, పర్వతాలు ఉండే అసోం రాష్ట్రంలో వైద్య సేవలు చాలా పరిమితంగానే ఉన్నాయి. ముఖ్యంగా మారుమూల గ్రామంలోని వారికి ఏదైన అనారోగ్యం తలెత్తితే అక్కడకు అంబులెన్స్ చేరుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది. దీనిని గుర్తించిన అసోం ప్రభుత్వం బైక్ అంబులెన్స్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన ఈ అంబులెన్స్ బైక్స్ కొన్ని ఏరియాల్లో సత్ఫలితాలు ఇస్తున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వీటి సేవలు విస్తరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
నెట్టింట భిన్నాభిప్రాయాలు..
బైక్ అంబులెన్స్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఐడియాను మెచ్చుకుంటుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. చాలా ఓపెన్ గా, ఎలాంటి వైద్య పరికరాలు లేని ఈ బైక్ అంబులెన్స్ లో రోగిని తరలించడం అంత శ్రేయస్కరం కాకపోవచ్చని పలువురు పేర్కొంటున్నారు. పైగా బైక్ అంబులెన్స్ చాలా ఓపెన్ గా ఉండటం వల్ల ఇది గాయపడ్డ వ్యక్తి గోప్యతకు ఇబ్బందిగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Maharashtra Govt: అమ్మబాబోయ్.. 1300 మంది గ్రామస్థులకు.. 3 నెలల్లో 27 వేల మంది సంతానం!
సాధారణ రోగుల కోసం..
అయితే ఈ బైక్ అంబులెన్స్ ను సాధారణ రోగుల కోసం మాత్రమే వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు, హార్ట్ అటాక్, ప్రసవ నొప్పులు, అగ్ని ప్రమాదాల్లో గాయపడ్డ రోగులను తరలించేందుకు పెద్ద అంబులెన్స్ ఉపయోగిస్తున్నారు. చిన్నపాటి రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని, రోడ్డు మార్గం అందుబాటులో లేని గ్రామాలకి మాత్రమే ప్రస్తుతం ఈ బైక్ అంబులెన్స్ అందుబాటులో ఉంచారు.

