Woman Constable Suicide: మహిళలు వేధింపులకు గురవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా ఓ మహిళా కానిస్టేబుల్.. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడటం వరంగల్ లో సంచలనంగా మారింది. పెళ్లి చేసుకోమని ఒకరు.. డబ్బు ఇస్తేనే వివాహం చేసుకుంటానని మరొకరు.. వరుసపెట్టి వేధించడంతో అనిత అనే ఏఆర్ కానిస్టేబుల్ ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న వరంగల్ పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ మెుదలు పెట్టారు.
వివరాల్లోకి వెళ్తే..
వరంగల్ జిల్లా పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన అనిత.. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. అయితే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లి తండాకు చెందిన రాజేందర్ అనే దూరపు బంధువు.. పెళ్లి పేరుతో 4 ఏళ్లుగా అనిత వెంటబడుతున్నాడు. డ్యూటీలో ఉండగా వీడియో కాల్ చేయాలని, వేరే ఎవరితోనూ చనువుగా మాట్లాడవద్దని వేధింపులకు పాల్పడ్డాడు. రాజేందర్ వైఖరి నచ్చక అతడితో కూతురు పెళ్లిని అనిత తల్లిదండ్రులు సైతం నిరాకరించారు. వివాహం కుదరదని తెగేసి చెప్పారు. అయినా రాజేందర్ బతిమాలుతూనే వచ్చాడు.
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
వరంగల్ ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న పర్వతగురి మండలం సీత్యతండాకు చెందిన అనిత అనే మహిళా కానిస్టేబుల్
ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక గడ్డి మందు తాగి బలవన్మరణం
రాజేందర్, జబ్బార్లాల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
పెళ్లి… pic.twitter.com/so8rBvuVWj
— BIG TV Breaking News (@bigtvtelugu) January 30, 2026
ఇష్టపడ్డ వ్యక్తి సైతం..
మరోవైపు ఏఆర్ కానిస్టేబుల్ అనిత.. తన క్లాస్ మేట్ అయిన జబ్బార్ లాల్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నట్లు రాజేందర్ తెలుసుకున్నాడు. అతడ్నే పెళ్లి చేసుకోవాలని ఆమె భావిస్తున్నట్లు కనుగొన్నాడు. దీంతో జబ్బార్ కు ఫోన్ చేసి.. అనిత గురించి మాయమాటలు చెప్పాడు. అనిత వ్యక్తిత్వం గురించి అసత్యాలు వల్లించాడు. అవి నిజమని నమ్మిన జబ్బార్ లాల్.. అతడు కూడా అనితను వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడం మెుదలు పెట్టాడు. లేదంటే తమ బంధం పెళ్లి పీటలు ఎక్కకుండానే ముగిసిపోతుందని తెగేసి చెప్పాడు.
Also Read: Kanchana Re-Release: హరర్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మరింత క్లారిటీతో ‘కాంచన’ వచ్చేస్తుంది.. ఎప్పుడంటే?
మానసిక వేదన తట్టుకోలేక..
జబ్బార్ లాల్ తో వివాహం చేసుకొని సంతోషంగా జీవించాలని భావించిన అనిత.. స్నేహితుడు రివర్స్ అవ్వడంతో తట్టుకోలేకపోయింది. తీవ్ర మానసిక వేదన గురైంది. దీనంతటికి కారణమైన రాజేందర్ కు జనవరి 27న అనిత ఫోన్ చేసింది. జబ్బార్, నువ్వు కలిసి తన జీవితాన్ని నాశనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మీ వల్లే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానని బెదిరించింది. అయితే అనితను వారించాల్సింది పోయి.. చస్తే చావమని రాజేందర్ కఠువుగా సమాధానం ఇచ్చాడు. దీంతో అనిత వెంటనే గడ్డి మందు తాగి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. ఘటనను సీరియస్ గా తీసుకున్న వరంగల్ పోలీసులు.. ఇందుకు కారణమైన జబ్బార్ లాల్, రాజేందర్ పై కేసు నమోదు చేసిన విచారణ చేస్తున్నారు.

