Viral Video: రాజస్థాన్ లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. దొంగతనానికి వెళ్లిన ఓ వ్యక్తి అదే ఇంట్లోని ఓ రంధ్రంలో ఇరుక్కుపోయాడు. దాదాపు గంటసేపు నిస్సహాయంగా అక్కడే వేలాడుతూ ఉండిపోయారు. బయటకు వెళ్లి తిరిగొచ్చిన ఇంటి యజమానులు రంధ్రంలో ఇరుక్కుపోయిన దొంగను చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇంటికి చేరుకున్న పోలీసులు దొంగను బయటకు తీసి.. అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
రాజస్ధాన్ లోని కోటా ప్రాంతంలో జనవరి 3న ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇంటి యజమాని సుభాష్ కుమార్ రావత్ తన భార్యతో కలిసి బైక్ మీద పక్క ఊరికి వెళ్లారు. తిరిగి రాత్రి ఒంటి గంట ప్రాంతంలో తిరిగొచ్చారు. ఈ క్రమంలో వంటగది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఏర్పాటు చేసిన రంధ్రంలో ఓ దొంగ ఇరుక్కుపోయి వారికి కనిపించారు. సగ భాగం ఇంట్లో, సగం బయట ఉన్న స్థితిలో దొంగ చిక్కుకుపోయాడు.
రంగంలోకి పోలీసులు
ఎగ్జాస్ట్ రంధ్రంలో దొంగను చూడగానే తొలుత షాక్ కు గురైన సుభాష్ కుమార్ దంపతులు.. వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వచ్చిన పోలీసులు.. రంధ్రంలో ఇరుక్కుపోయిన దొంగను అతి కష్టం మీద బయటకు తీశారు. సుమారు గంట పాటు రంధ్రంలోనే ఇరుక్కొని దొంగ విలవిలలాడినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లోకి వెళ్లలేక, బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాడని పేర్కొన్నారు.
పారిపోయిన మరో దొంగ..
వాస్తవానికి ఇద్దరు వ్యక్తులు ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో వంటగదికి ఉన్న ఎగ్జాస్ట్ రంధ్రం గుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ ప్రయత్నంలోనే వారిలోని ఒకరు ఇరుక్కుపోయారని చెప్పారు. అయితే అతడ్ని బయటకు తీసుకొచ్చేందుకు మరో దొంగ ప్రయత్నించినప్పటికీ అదే సమయంలో సుభాష్ కుమార్ దంపతులు ఇంటికి తిరిగొచ్చారని అన్నారు. గేటు తీసే చప్పుడు విని మరో దొంగ అక్కడ నుంచి ఉడాయించాడని పేర్కొన్నారు.
Also Read: Viral News: సూపర్ ఐడియా.. బైక్‌నే అంబులెన్స్‌గా మార్చేశారు.. వీడియో వైరల్
కారులో వచ్చి మరి..
నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా పోలీసు స్టిక్కర్ ఉన్న కారులో వచ్చారని దర్యాప్తు అధికారులు తెలిపారు. పారిపోయిన మరో దొంగను సైతం పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అయితే గతంలో జరిగిన పలు దొంగతనాల్లోనూ వీరి హస్తముందా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతున్నట్లు వివరించారు.
A theft did was foiled after the thief got stuck in the exhaust vent of the house he was trying to enter in Kota district of Rajasthan. Later, owner alerted cops who arrived and rescued him. pic.twitter.com/SQnpIrXP3s
— Piyush Rai (@Benarasiyaa) January 6, 2026

