Noida Woman: ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడా ప్రాంతంలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. భర్తకు బట్టతల ఉందంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇది చూసి పోలీసులు సైతం అవాక్కైనట్లు తెలుస్తోంది. 2024 ప్రారంభంలో తనకు వివాహమైందని.. బట్టతల ఉన్న విషయాన్ని తన వద్ద దాచి పెళ్లి చేసుకున్నాడని భార్య ఆరోపించింది.
వివరాల్లోకి వెళ్తే..
నోయిడాకు చెందిన లవికా గుప్తా (Lavika Gupta).. బిస్రాఖ్ పోలీసు స్టేషన్ (Bisrakh police station)లో తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ రిపోర్టు ప్రకారం.. ఆమెకు 2024 జనవరి 16న సన్యం జైన్ (Sanyam Jain)తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో తనకు ఒత్తైన జుట్టు ఉందని జైన్ చెప్పినట్లు లవికా తెలిపింది. అతడి జుట్టు చూసి అది ఒరిజినల్ అని తాను భ్రమపడినట్లు ఆమె చెప్పింది. పెళ్లి తర్వాత కూడా కొన్ని నెలల పాటు అనుమానం రాకుండా జుట్టుకు హెయిర్ ప్యాచెస్ వాడాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు బట్టతల ఉన్న విషయాన్ని దాచి జైన్ తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆర్థిక స్థితిగతులు, ఆదాయం, ఉద్యోగం గురించి కూడా జైన్ అబద్దాలు చెప్పాడని వాపోయింది.
బ్లాక్ మెయిల్ సైతం..
భర్త జైన్ నిజ స్వరూపం పెళ్లైన కొద్ది కాలానికే తనకు తెలిసిందని లవికా స్పష్టం చేసింది. ఈ విషయమై అతడ్ని ప్రశ్నించగా.. తనను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడని ఆమె ఆరోపించారు. ప్రైవేటు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడని, శారీరకంగా తనను పలుమార్లు కొట్టాడని బాధితురాలు పేర్కొంది. విదేశాలకు వెళ్లిన సమయంలో తనపై దాడి ఈ జరిగినట్లు ఆమె చెప్పారు. అంతేకాకుండా ఓసారి థాయిలాండ్ కు వెళ్లినప్పుడు అక్కడి నుంచి ఇండియాకు గంజాయి తీసుకురావాలని జైన్ ఒత్తిడి తెచ్చినట్లు లవికా ఆరోపించింది. వీటితో పాటు వరకట్నం కోసం కూడా జైన్, అతడి ఫ్యామిలీ వేధించినట్లు ఆమె చెప్పుకొచ్చారు.
Also Read: Suresh Kalmadi: కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.. రాజకీయాలపై ఆయన ప్రభావమెంత?
భర్తపై కేసు నమోదు..
తొలుత ఈ కేసును సాధారణంగా తీసుకున్న బిస్రాఖ్ పోలీసు స్టేషన్ అధికారులు.. లవికా గుప్తా చేసిన సీరియస్ ఆరోపణలను పరిగణలోకి తీసుకున్నారు. భర్త జైన్ తో పాటు, అత్త మామలు, ఇతర కుటుంబ సభ్యులు సహా మెుత్తం ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్త్రీని హింసించడం, నమ్మక ద్రోహం, దాడి, వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం లవికా ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామని.. త్వరలోనే ఆమె భర్త జైన్, అతడి ఫ్యామిలీని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

