Suresh Kalmadi: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేష్ కల్మాడీ (81) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన ప్రాణాలు విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. సురేష్ కల్మాడీ.. గత కొన్ని రోజులుగా మహారాష్ట్ర పుణేలోని దీనా నాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించి మరణించినట్లు తెలుస్తోంది.
ప్రజల సందర్శనార్థం..
బంధువులు, ఆత్మీయులు, ప్రజలు, కుటుంబ సభ్యుల సందర్శనార్థం ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆయన పార్ధివ దేహాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు కల్మాడీ కార్యాలయం తెలిపింది. పుణెలోని ఆయన నివాసంలో కల్మాడీ భౌతికకాయానికి నివాళులు అర్పించవచ్చని తెలిపింది. అనంతరం మ.3.30 గంటలకు పుణేలోని నవీపేట్ ప్రాంతంలో గల వైకుంఠ స్మశాన వాటికలో కల్మాడి అంత్యక్రియలు జరగనున్నట్లు స్పష్టంచింది.
రాజకీయ ప్రస్థానం..
1980లో కాంగ్రెస్ (ఎస్) తరపున తొలిసారి రాజ్యసభకు సురేష్ కల్మాడీ ఎంపికయ్యారు. ఆ తర్వాత 1986, 1992లో వరుసగా మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. 1996లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి పుణే నుంచి లోక్ సభ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009 ఎన్నికల్లోనూ ఎంపీగా గెలుపొందారు. 1998లో పోటీ సందర్భంగా బీజేపీ, శివసేన ఆయనకు మద్దతు ప్రకటించడం గమనార్హం. పుణే నగర అభివృద్ధికి కల్మాడీ ఎనలేని కృషి చేసినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. పీవీ నరసింహరావు హయాంలో ఆయన కేంద్ర రైల్వే మంత్రిగాను వ్యవహరించడం విశేషం.
Also Read: Kavitha: కవిత కొత్త పార్టీ.. ఈ ఏడాదిలో పేరును ప్రకటించే అవకాశం!
2011లో కల్మాడీ అరెస్టు
సురేష్ కల్మాడీ భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఈ క్రమంలో ఆయనపై నిధుల దుర్వినియోగం అభియోగాలు వచ్చాయి. 2010 కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ సందర్భంగా కల్మాడీ చేతివాటం ప్రదర్శించినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ ఘటన ఆయన రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. అవినీతి ఆరోపణలకు సంబంధించి 2011లో ఆయన్ను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేయడంతో కల్మాడీ రాజకీయ జీవితానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడింది. అయితే నిధుల దుర్వినియోగం కేసులో కల్మాడీని నిర్దోషిగా కోర్టు తేల్చింది. దీంతో ఆయన్ను తిరిగి 2016లో ఐఓఏ అధ్యక్షుడిగా నియమించినప్పటికీ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురై తుదిశ్వాస విడిచారు. మరోవైపు కల్మాడీ మృతిపట్ల కాంగ్రెస్ నేతలు, శ్రేణులు సంతాపం తెలియజేస్తున్నారు.

