Kavitha: కవిత కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు జాగృతి స్వచ్ఛంద సంస్థగానే కొనసాగుతుంది. అయితే, అదే తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) పేరు మీదనే పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందని సమాచారం. ఎప్పుడు పార్టీ ప్రకటన చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీ పేరుతోనే పోటీ చేస్తున్నట్లు మాత్రం ప్రకటించారు. లెఫ్ట్ పార్టీలు, మావోయిస్ట్ సానుభూతిపరులతో కలిసి తెలంగాణ జాగృతి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నదని కవిత ప్రకటించారు. తెలంగాణ ప్రజల తరఫున నిలబడి పోరాటం చేస్తూ ఒక శక్తిగా ఎదుగుతామని, లెఫ్ట్ పార్టీలు, మావోయిస్ట్ సానుభూతి పరులు, మనుగడ కొనసాగించలేకపోతున్న మావోయిస్టులు, ప్రజాస్వామ్య పద్దతిలో పనిచేసే పార్టీ రావాలనుకుంటున్న వారు తనకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్‌లో గౌరవం దక్కలేదు
తెలంగాణ కోసం పోరాటం చేసిన లక్షలాది మంది ఉద్యమకారులకు (BRS) బీఆర్ఎస్‌లో ఇసుమంత కూడా గౌరవం దక్కలేదని, వేలాదిగా పోస్టులు ఉన్నా సరే వారికి పదవులు ఇవ్వాలని గుర్తుకు రాకపోవడం విచారకరమని ఆరోపించారు. ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పని చేస్తే వారికి అవకాశాలే రాలేదని, ఒకరిద్దరూ తన లాంటి వాళ్లకు మాత్రమే అవకాశం వచ్చిందని గుర్తు చేశారు. కానీ, తనను కూడా చిత్రహింసలు, నానా అవమానాలకు గురి చేసి రాజకీయంగా ఎదగకుండా చేశారని ఆరోపించారు. అలా చేసి ఆ పార్టీ ఏం సాధించుకుందో ప్రజలకు చెప్పాలన్నారు. తొమ్మిదిన్నరేళ్లలో 14 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి 12 లక్షల కోట్లు ఖర్చు చేశారని, ఒక్క ఇరిగేషన్ కోసమే లక్షా 89 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పారు. కానీ, పేద ప్రజలకు మాత్రం ఇళ్లు ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Kavitha: కవిత ఎపిసోడ్‌పై కాంగ్రెస్ పరిశీలన.. నిజంగానే విమర్శలు చేస్తున్నారా?
కవిత పార్టీ పేరును ప్రకటించే అవకాశం
ఉద్యమకారులు తమకు గుర్తింపు కార్డులు ఇచ్చి గౌరవించాలని ఆశిస్తే అది కూడా చేయలేదన్నారు. రాష్ట్రంలో తెలంగాణ పేరును తనలో నింపుకొని మన అస్తిత్వం కోసం పోరాడే పార్టీ రావాల్సి ఉన్నదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాని విద్యార్థులు పిడికిలెత్తి పోరాటం చేసేందుకు జాగృతిలో చేరాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు కావాలంటే తనతో పాటు పోరాడాలని, ఆదివాసీ, గిరిజన, దళిత, మైనార్టీ బిడ్డల కోసం పోరాటం చేసే పార్టీ కావాలని చెప్పారు. అందరి కన్నా ఆడబిడ్డల హక్కులు, అస్తిత్వం కోసం పోరాటం చేసే తనను దీవించాలని కోరారు. అన్ని బంధాలు, బంధానాలు తెంచుకొని అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి బయటకు వచ్చానని, జనం బాట మొదటి రోజే ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలు తనను క్షమించాలని రిక్వెస్ట్ చేశానన్నారు. ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలను కూడా జాగృతిలో చేరాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివరిలో లేకుంటే మరికొంత గడువు తీసుకుని కవిత పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. శాసనమండలిలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ప్రకటించిన తర్వాత గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. తన పోరాటం ఆత్మగౌరవ పోరాటమేనని స్పష్టం చేశారు.
జాగృతి జనం బాట
కొత్త పార్టీ నేపథ్యంలో కవిత(Kavitha) రాజకీయంగా ఇక స్పీడ్ పెంచనున్నారు. ఇప్పటికే జాగృతి జనం బాట పేరుతో ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించి ఆ నియోజకవర్గాల్లోని ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. మేధావులు ఉద్యమకారులతోపాటు నిరుద్యోగ యువతతో భేటీ అవుతున్నారు. మరోవైపు, అన్ని కులాల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. త్వరలోనే ఆయా సమస్యలపై ఉద్యమం బాటపటనున్నట్లు సమాచారం. నిరసనలు, ధర్నా కార్యక్రమాలు సైతం చేపట్టబోతున్నట్లు జాగృతి వర్గాలు తెలిపాయి. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రజా సమస్యలపై పోరాటం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రజలతో మమేకమై వారి ఆదరణ పొందిన తర్వాతనే పార్టీని ప్రకటించబోతున్నట్లు సమాచారం. తెలంగాణ జాగృతి ప్రజలకు సుపరిచితం కావడంతోనే ఆ పేరు మీదనే పార్టీని కవిత ప్రకటించబోతున్నారు.
తండ్రి బాటలోనే..
నాడు కేసీఆర్ (KCR) సైతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన అంటూ టీడీపీకి రాజీనామా చేశారు. 2001 ఏప్రిల్ 21న డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. అదే నెల 27వ తేదీన టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేశారు. నాడు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ ప్రభుత్వంలో అసెంబ్లీ జరుగుతున్న తరుణంలోనే కేసీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత రాజీనామా ప్రకటన చేశారు. తాజాగా కవిత సైతం శాసనమండలికి వచ్చి రాజీనామాకు గల కారణాలను వివరించి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా ఆమోదించాలని కోరడంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని ఎండగట్టారు.
అస్వస్థకు గురైన కవిత
శాసన మండలిలో భావోద్వేగంతో కూడిన ప్రసంగం తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురయ్యరు. బ్లడ్ ప్లెజర్ పెరిగింది. బంజారాహిల్స్‌లోని నివాసంలో డాక్టర్లు పరీక్షించారు. ఉద్వేగానికి గురి కావొద్దని సూచించారు.
నేడు జాగృతి రాష్ట్ర కమిటీ విస్తృత స్థాయి సమావేశం
తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు అనుబంధ సంఘాల సభ్యుల సైతం హాజరు కావాలని సమాచారమిచ్చారు. ఈ సమావేశంలో జాగృతి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది.
సిరిసిల్ల జనం బాట వాయిదా
తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో తలపెట్టిన సిరిసిల్ల జిల్లా జాగృతి జనం బాట పర్యటనను వాయిదా వేశారు. ఇప్పటికే వాయిదా వేసిన పెద్దపల్లి జిల్లాతో పాటు సంక్రాంతి పండుగకు ముందు నిర్వహించాల్సిన జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల జనంబాట కార్యక్రమాలను పండుగ తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.
Also Read: Kavitha: కవిత రాజీనామా వెనుక అసలు కారణమేంటి? మండలిలో బహిర్గతమయ్యే నిజాలు ఇవే?

