Mass Maharaja: రవితేజకు ‘మాస్ మహారాజ్’ అనే బిరుదు ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో అన్న దానిపై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. తాజాగా జరిగిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హరీష్ శంకర్ మాట్లాడారు. అదే సందర్భంలో రవితేజ మాస్ మహారాజ్ టైటిల్ వద్దంటున్నారని సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై ఆయన ఇలా స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మాస్’ అనే పదానికి నిలువెత్తు రూపం రవితేజ. ఆయన ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. అందుకే ఆయన్ని అందరూ ప్రేమగా ‘మాస్ మహారాజ్’ అని పిలుచుకుంటారు. అయితే తాజాగా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్ర ప్రీ-రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ ఈ బిరుదు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read also-Akhanda 2: ‘అఖండ 2’కు చినజీయర్ స్వామి ప్రశంసలు.. ధర్మాన్ని రక్షించే సినిమా
హరీష్ శంకర్ మాట్లాడుతూ, రవితేజకు ‘మాస్ మహారాజ్’ అనే బిరుదును తానే ఇచ్చానని గర్వంగా ప్రకటించారు. “మాస్ మహారాజ్ అనే టైటిల్ పెట్టింది నేనే, దానికి సంబంధించిన పేటెంట్ రైట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఆ టైటిల్ ఉంచాలన్నా, తీసేయాలన్నా ముందు నన్ను అడగాలి” అంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. రవితేజ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ‘మిరపకాయ’ సినిమా సమయంలో ఈ బిరుదు మరింత ప్రాచుర్యం పొందింది. రవితేజలోని మాస్ యాంగిల్‌ను హరీష్ శంకర్ ఆవిష్కరించిన తీరు అమోఘం.
కేవలం బిరుదు గురించి మాత్రమే కాకుండా, రవితేజ వ్యక్తిత్వం గురించి హరీష్ శంకర్ ఎంతో గొప్పగా చెప్పారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రవితేజ ఎప్పుడూ ఒకేలా ఉంటారని ఆయన కొనియాడారు. “మిరపకాయ లాంటి భారీ హిట్ వచ్చినా, మిస్టర్ బచ్చన్ లాంటి ఫలితం వచ్చినా ఆయన ప్రవర్తనలో మార్పు ఉండదు. బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు పొంగిపోవడం, ఫ్లాప్ వచ్చినప్పుడు కుంగిపోవడం ఆయనకు తెలియదు. దీన్నే భగవద్గీతలో ‘స్థితప్రజ్ఞత’ అంటారు. ఇలాంటి క్వాలిటీ నేను ఇద్దరిలోనే చూశాను, ఒకరు పవన్ కళ్యాణ్ , మరొకరు రవితేజ ” అని హరీష్ పేర్కొన్నారు.
Read also-Jana Nayagan: విజయ్ ‘జన నాయగన్’ ఆఫర్ వదులుకున్న అనిల్ రావిపూడి.. అసలు కారణం ఇదే!
రవితేజతో తనకున్న అనుబంధాన్ని వివరిస్తూ, తనకు దర్శకుడిగా పునర్జన్మ ఇచ్చింది రవితేజ అని హరీష్ శంకర్ భావోద్వేగానికి లోనయ్యారు. గత చిత్రం సరిగ్గా ఆడలేదన్న నిజాన్ని నిర్మొహమాటంగా ఒప్పుకుంటూనే, “మళ్ళీ రవితేజతో సినిమా తీస్తా, కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టి తీరుతా” అని సవాల్ చేశారు. ఇది రవితేజపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని, గౌరవాన్ని సూచిస్తుంది. సినిమా రంగంలో బిరుదులు రావడం సహజం, కానీ ఒక దర్శకుడు ఒక హీరోకు ఇచ్చిన బిరుదు కాలక్రమేణా ఆ హీరోకు పర్యాయపదంగా మారిపోవడం విశేషం. రవితేజ అంటేనే మాస్.. మాస్ అంటేనే రవితేజ అనేలా ఆ పేరు స్థిరపడిపోయింది. హరీష్ శంకర్ చెప్పినట్లుగా, ఈ ‘మాస్ మహారాజ్’ ప్రయాణం మరిన్ని విజయాలతో కొనసాగాలని అభిమానులు కోరుకుంటున్నారు. సంక్రాంతి బరిలో వస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం రవితేజకు మరో ఘనవిజయాన్ని అందిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

