Mahabubabad District: మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రభుత్వ గిరిజన ఉపాధ్యాయురాలికి ఆర్టీసీ డ్రైవర్తో ఘోర అవమానం ఎదురయింది. వివరాల్లోకి వెళ్తే… మహబూబాబాద్ జిల్లా కేంద్రం శివారు బాబు నాయక్ తండాకు చెందిన తేజావత్ బీమా నాయక్ భార్య స్వర్ణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం ఆళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గత ఏడేళ్లుగా ఆర్టీసీ బస్సును నమ్ముకుని ప్రయాణం చేస్తూ తన ఉపాధ్యాయ విధులను చెక్కబెడుతూ స్వర్ణ వస్తుంది. అయితే బుధవారం స్వర్ణకు అనుకొని చేదు అనుభవం ఎదురయింది.
Also Read: Heavy Rains: కుండపోత వర్షంతో కనిపించని రహదారులు.. ఎక్కడంటే..?
రోజువారీగా స్కూల్ కు వెళ్లాల్సిన స్వర్ణ అత్యవసర విధుల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్రాస్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు ను ఆపి ఎక్కాలనుకుంది. కానీ, ఆ బస్సు డ్రైవర్ స్వర్ణ ఆపిన విషయాన్ని పట్టించుకోకుండా ముందుకు బస్సును తీసుకెళ్లాడు. సమయం లేనందున అత్యవసరంగా పాఠశాలకు వెళ్లాల్సిన క్రమంలో తన భర్త భీమా నాయక్ ద్విచక్ర వాహనంపై బస్సును చేజ్ చేసి పాఠశాలకు బస్సు ఎక్కి వెళ్లాలనుకుంది. ఈ నేపథ్యంలో బస్సును వెంబడించిన ద్విచక్ర వాహనాన్ని గమనిస్తున్నప్పటికీ డ్రైవర్ పట్టించుకోకుండా బస్సును పదేపదే ముందుకు పరిగెత్తించాడు.
రిక్వెస్ట్ చేసిన బస్సు ఆపని డ్రైవర్
ఆర్టీసీ డ్రైవర్ కం కండక్టర్గా విధులు నిర్వహిస్తున్న గుండ్రాతిమడుగు గ్రామ శివారు తండాకు చెందిన బాబురావు అలియాస్ ఆర్ బి జి సింగ్ మహిళ ఉపాధ్యాయురాలు విషయంలో కఠినంగా వ్యవహరించాడు. టీజీ 26 జెడ్ 0004 బస్సును ఎట్టకేలకు మహిళా ఉపాధ్యాయురాలి భర్త బయ్యారం మండల కేంద్రంలో బస్సును ఆపాడు. ఈ క్రమంలో తీవ్ర అసహనానికి గురైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ తన సీటు పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో కిందకు దిగి మహిళా ఉపాధ్యాయురాలి భర్తపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. విషయాన్ని గమనించిన బయ్యారం పోలీస్ కానిస్టేబుల్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ను వారించడంతో ఆగిపోయాడు. లేదంటే డ్రైవర్ మహిళా ఉపాధ్యాయురాలి భర్తపై ఏ ఘోరమైన ఘటనకు పాల్పడేవాడోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టీసీ డిపో మేనేజర్, బయ్యారం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు
ఆర్టీసీ డ్రైవర్ ఆర్ బి జి సింగ్ ఎలియాస్ బాబురావు చేసిన దుర్మార్గమైన విషయంపై మహిళా ఉపాధ్యాయురాలు ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్, బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిరుపతి లకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డిపోలో మేనేజర్ కు ఇచ్చిన ఫిర్యాదులో శాఖపరమైన చర్యలు చేపట్టి డ్రైవర్ పై కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా బయ్యారం పోలీస్ స్టేషన్ ఎస్ఐ తిరుపతికి సైతం ఫిర్యాదు అందజేసి ఘటనకు సంబంధించిన పూర్వపరాలు విచారణ చేసిన అనంతరం ఆర్టీసీ డ్రైవర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read: Formula E Case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కీలక స్టెప్.. ఏం జరగబోతోంది?