Swetcha Effect: నీలాద్రి అర్బన్ పార్క్‌లో జరిగిన దుప్పుల వేట కేసులో ప్రధాన నిందితుడు మాజీ బిఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు(Mecha Nageswara Rao) సోదరుడి తనయుడు మెచ్చా రఘు అన్న విషయం చివరకు వెలుగులోకి వచ్చింది. శుక్రవారం రఘు సత్తుపల్లి ఎఫ్ఎఓ వాడపల్లి మంజుల సమక్షంలో లొంగిపోయాడు. అతడితో పాటు దమ్మపేట మండలం గొర్రెగుట్టకు చెందిన కుంజా భరత్ కూడా లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు. గత నెల 29 నుంచి స్వేచ్ఛ పత్రిక వరుస కథనాలు వెలువరించడంతో కేసు మళ్లీ వేగం అందుకుంది.
రఘు ప్రధాన పాత్ర
ఈ కేసులో తొలుత అర్బన్ పార్క్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పంతంగి గోపికృష్ణ(GopiKrishna), సొంఠి శ్రీరాంప్రసాద్(Sriramprasad)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపడంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి. వేట జరిగిన రాత్రి ‘వారాహి’ స్టిక్కర్ ఉన్న వాహనం పార్క్‌లోకి ప్రవేశించినట్లు సీసీ కెమెరాలు స్పష్టంగా చూపించినా, ఆ వాహనం యజమాని వివరాలు వెల్లడించకపోవడం దర్యాప్తుపై విమర్శలకు కారణమైంది. కాగా రఘు ప్రధాన పాత్ర పోషించినప్పటికీ కేసులో ఆయన్ని ఏ2గా చేర్చి, ఉద్యోగుల పేర్లను ఏ1, ఏ3, ఏ4గా నమోదు చేయడం ఏమీటో అనీ ప్రజలు ప్రశ్నిస్తున్న అంశంగా మారింది. వివాహ విందులో దుప్పుల మాంసం వడ్డించిన ఘటన కూడా ఈ వేటకే సంబంధమని దర్యాప్తులో తేలింది. రఘు వివాహ వేడుక నేపథ్యంలో అర్బన్ పార్క్‌లో ఐదు దుప్పులను వేటాడి సుమారు 400 కిలోల దుప్పి మాంసాన్ని విందుకు తరలించినట్లు అటవీశాఖ నిర్ధారించింది. తుపాకీ కొన్నది రఘేనని, వేటలో కీలక పాత్ర అతనిదేనని స్పష్టమైనా, తమ అబ్బాయిని ఏ1గా ఎందుకు చేర్చారని గోపికృష్ణ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: High Court: హైకోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఎందుకంటే..?
వినిపిస్తున్న గుసగుసలు
అక్టోబర్‌లో రాత్రి 11 గంటల సమయంలో కొందరు వ్యక్తులు కారులో పార్క్‌లోకి ప్రవేశించి ఐదు దుప్పులను వేటాడి తీసుకెళ్లినట్లు సీసీ కెమెరా పుటేజీల్లో కనిపించింది. ఆ రాత్రి గాయపడి తప్పించుకున్న మరో దుప్పి మరుసటి రోజు బైపాస్ రోడ్ సమీపంలో కనిపించగా అటవీ సిబ్బంది స్వాధీనపర్చుకున్నారు. దానిని వైద్యం చేసి పార్క్‌లో విడిచేశామని అధికారులు చెప్పినా, వాస్తవానికి దుప్పి వేటగాయాల కారణంగా మృతి చెందిందని స్థానికంగా వినిపిస్తున్న గుసగుసలు భిన్నంగా ఉన్నాయి. రఘు ఉపయోగించిన తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న ఇంకా అనుమానంగానే ఉంది. లైసెన్స్ ఉన్న తుపాకీని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసినప్పటికీ, వేటలో వాడిన ఆయుధం మూలాలు ఇంకా బయటపెట్టలేదు. రఘు గతంలో కూడా వేటాడాడా, వేట సమయంలో అటవీశాఖ సిబ్బంది ఎవరైనా సహకరించారా, వాహనాల ప్రయాణ వివరాలు ఎందుకు ఆలస్యంగా వెల్లడించారు? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రారంభ దశలో అటవీశాఖ స్పష్టత చూపకపోవడంపై పర్యావరణ ప్రేమికులు విమర్శలను వ్యక్తం చేశారు.
వివాహ విందుకు మాంసం
ప్రాథమిక విచారణ ఆధారంగా రఘుపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద పలు సెక్షన్లు అమలయ్యాయి. అధికారుల ప్రకారం కనీసం మూడు నుంచి ఏడు ఏళ్ల జైలు శిక్షతో పాటు వేటలో ఉపయోగించిన వాహనాల స్వాధీనం, భారీ జరిమానాలు తప్పవు. లొంగిపోయిన రఘు, భరత్‌లను అధికారులు విడిగా విచారించి సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. రెండు ఘటనలు అర్బన్ పార్క్‌లో వేట, వివాహ విందుకు మాంసం తరలింపు—పరస్పరం అనుసంధానమై ఉన్నాయని అటవీశాఖ స్పష్టంచేసింది. ఈ కేసు పూర్తి వివరాలు వెలుగులోకి రావడంతో ఖమ్మం(Khammam) జిల్లాలో ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద వన్యప్రాణుల వేట కుంభకోణంగా మారింది. ఎవరూ మినహాయింపు లేకుండా చర్యలు తీసుకోవాలని, పూర్తి నివేదికను వెంటనే విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: New Year Drugs Supply: న్యూఇయర్ వేడుకలకు డ్రగ్స్ సిద్ధం చేసి.. అడ్డంగా దొరికారు.. వాటి విలువ ఎంతంటే?

