SRLIP Project: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం, యాతలకుంట గ్రామంలో ఎస్ఆర్ఎల్ఐపి ఇరిగేషన్ ప్రాజెక్టు(SRLIP Irrigation Project)కు సంబంధించి జారీ చేసిన ఎ.9.35 కుంటలు భూసేకరణ ప్రాథమిక నోటిఫికేషన్ (ఫైల్ నెం. A/1153/2025, తేది: 21-10-2025) వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. నోటిఫికేషన్లో అభ్యంతరాలు తెలియజేయడానికి ఇచ్చిన 60 రోజుల గడువు ముగిసిన తర్వాత అకస్మాత్తుగా గ్రామసభ నిర్వహించడం చట్టబద్ధతపై సందేహాలు రేకెత్తించగా, గ్రామస్థుల ఆగ్రహం ఉప్పొంగుతోంది. నోటిఫికేషన్ను కేవలం వార్తాపత్రికల ద్వారా మాత్రమే ప్రచురించి, గ్రామస్థాయిలో సమాచారం ఇవ్వలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైందో తెలియదని గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారని దీనివల్ల నిర్దిష్ట గడువులో అభ్యంతరాలు తెలియజేసే అవకాశం కోల్పోయామని, గ్రామ సభలో నోటిఫికేషన్లో పేర్కొన్న పేర్లలో తమ భూముల పట్టాదారులకు బదులుగా ఇతరుల పేర్లు నమోదు చేయడం ద్వారా భూస్వాముల హక్కులను కాలరాసే ప్రయత్నం జరిగిందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ లోపాల వల్ల కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సీనియర్ అసిస్టెంట్ రాజ్యమేలుతున్నాడా?
భూసేకరణ వంటి అత్యంత సున్నితమైన అంశంపై నిర్వహించిన గ్రామసభను సబ్ కలెక్టర్ లేకుండానే, భూసేకరణ విభాగానికి చెందిన ఒక సీనియర్ అసిస్టెంట్(Senior Assistant)ఆధ్వర్యంలో జరపడం సంచలనంగా మారింది. ఈ అధికారిపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయని, పలు భూసేకరణ ప్రక్రియల్లో వివాదాస్పద పాత్ర పోషించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఇతనిపై ఎలాంటి సమగ్ర విచారణ జరగకపోవడం వెనుక ఎవరి అండ ఉందన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ గ్రామసభ సబ్ కలెక్టర్కు తెలియకుండా జరిగిందా? లేక కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయం విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిందా? అనే అనుమానాలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.
సబ్ కలెక్టర్ గైర్హాజరు – పరిపాలనా వైఫల్యమా?
రైతుల భవితవ్యాన్ని ప్రభావితం చేసే భూసేకరణ అంశంపై నిర్వహించిన గ్రామసభకు సబ్ కలెక్టర్ హాజరు కాకపోవడం అధికార యంత్రాంగం వైఫల్యానికి పరాకాష్టగా మారిందని గ్రామస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన సమయంలో బాధ్యతగల అధికారి గైర్హాజరు కావడం పరిపాలనపై నమ్మకాన్ని దెబ్బతీసిందని వారు ఆరోపిస్తున్నారు.
Also Read: Singareni Tenders: పాలేరులో దుమారం లేపుతున్న కోల్ వివాదం.. కన్ఫ్యూజన్లో కీలక నేతలు..?
‘నాకు ఇవ్వండి నేను చూసుకుంటా’ – నమ్మలేని భరోసా:
గ్రామసభలో “ఏవైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా నాకు ఇవ్వండి, నోటిఫికేషన్ డిక్లరేషన్ సమయంలో పెడతాను” అంటూ సీనియర్ అసిస్టెంట్ ఇచ్చిన భరోసాపై గ్రామస్థులు తీవ్ర అనమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతుల సమస్యలను పరిష్కరించేందుకు కాకుండా, తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నమేనని వారు మండిపడుతున్నారు.
పరిపాలనపై నమ్మకం కూలుతోందా?
భూసేకరణ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ నిర్లక్ష్య ధోరణితోనే ఈ గ్రామసభ నిర్వహించబడిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ ఘటనతో సబ్ కలెక్టర్(Sub Collector)పై కూడా ప్రజలు నమ్మకం కోల్పోయే స్థితికి చేరుకున్నారని, సిబ్బంది పరిపాలన విషయంలో స్పష్టత లేకుండా కార్యాలయాన్ని నడిపిస్తున్నరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం ఇప్పటికే నియోజకవర్గ ప్రజల్లోనే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కూడా కోడై కూస్తూ చర్చనీయాంశంగా మారింది.
రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సబ్ కలెక్టర్ ఉంటే మా గోడు వినేవారని, సబ్ కలెక్టర్ హాజరు లేకుండా నిర్వహించిన ఈ గ్రామసభలో తమ ఫిర్యాదులు నిజంగా పై అధికారుల దృష్టికి చేరతాయన్న నమ్మకం లేదని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు. “సబ్ కలెక్టర్ హాజరు ఉంటే మా గోడును నేరుగా వినిపించుకునే అవకాశం ఉండేదని అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని సబ్ కలెక్టర్?.. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్!
ఎస్ఆర్ఎల్ఐపి భూసేకరణ నోటిఫికేషన్ మొత్తం ప్రక్రియపై స్వతంత్ర, సమగ్ర విచారణ చేయాలని భూస్వాములు బాధిత రైతులకు చట్టబద్ధంగా అభ్యంతరాలు తెలిపే అవకాశం పోయిందని, ఈ వ్యవహారంపై ఖమ్మం జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతు నిత్యం అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న భూసేకరణ విభాగ అధికారిపై ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని, ఈ సీనియర్ అసిస్టెంట్ అధికారిపై ఎన్ని ఫిర్యాదులు వచ్చిన పట్టించుకోవడంలేదని కనీస విచారణకు ఆదేశాలు నత్తనడకన ఉంటాయని అందుకే విధి నిర్వహణలో జరిగిన లోపాలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
ద్వంద్వ వైఖరి
పరిపాలనలో స్పష్టత లేకపోవడం, బాధ్యతల విషయంలో సబ్ కలెక్టర్ కల్లూరు డివిజన్లో ఉన్న ఉద్యోగులపై తన కార్యాలయంలో ఉన్న సిబ్బందిపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశం ఇప్పటికే నియోజకవర్గ ప్రజల్లోనే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కూడా కోడై కూస్తూ చర్చనీయాంశంగా మారింది. ఈ గ్రామ సభలో కల్లూరు భూసేకరణ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ అధ్యక్షతన, సత్తుపల్లి మండల కార్యాలయ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు మరియు యాతలకుంట పంచాయతి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల భూములు, జీవనోపాధి, భవిష్యత్తుతో ముడిపడి ఉన్న భూసేకరణ ప్రక్రియలో చిన్న నిర్లక్ష్యమే పెద్ద అన్యాయానికి దారి తీసే పరిస్థితి ఉంది. నిబంధనలు, గడువులు, పారదర్శకత పాటించాల్సిన చోట అధికారుల గైర్హాజరు, బాధ్యతల లేమి అనుమానాలకు తావిస్తోంది. ప్రజలు ప్రశ్నిస్తే సమాధానాలు రావాల్సిన వ్యవస్థలో, నమ్మకం కూలిపోతున్నదనే భావన తీవ్రంగా వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, ఎస్ఆర్ఎల్ఐపి(SRLIP) భూసేకరణ ప్రక్రియ మొత్తంపై నిష్పక్షపాత విచారణ జరిపి, తప్పిదాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని, రైతులకు చట్టబద్ధ న్యాయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పటివరకు ఈ వ్యవహారం ప్రజాస్వామ్య పరిపాలనలోని బాధ్యత, జవాబుదారీతనంపై నిలిచిన పెద్ద ప్రశ్నగానే మిగులుతోంది.
Also Read: Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ క్రేజీ అప్డేట్.. ఇక ఫ్యాన్స్కి పండగే!

