High Court: బతుకమ్మ కుంట కేసు విషయంలో హైకోర్టు(High Cort) ఆదేశాల మేరకు హైడ్రా(Hydraa) కమిషనర్ రంగనాథ్(Ranganadh) శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. గతంలో కోర్టు ధిక్కరణ కేసు విచారణకు హాజరు కాలేకపోవడంపై ఆయన ధర్మాసనానికి వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పారు. గత నెల 27న విచారణకు తాను హాజరుకాలేకపోవడానికి గల కారణాన్ని కమిషనర్ కోర్టుకు వివరించారు. బాచుపల్లి ప్రాంతంలో నివాస ప్రాంతాలు ముంపునకు గురైనందున, అక్కడి పరిస్థితులను సందర్శించేందుకు వెళ్లాల్సి వచ్చిందని, అందుకే హాజరు కాలేకపోయానని కోర్టుకు తెలియజేశారు. హైడ్రా కమిషనర్ వివరణను స్వీకరించిన హైకోర్టు, తదుపరి విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మినహాయింపునిచ్చింది.
Also Read: CM Revanth Reddy: నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటన.. రూ.532 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కేసు పూర్వాపరాలు
కాగా, అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట(Bathukamma Lake) పరిధిలోని ప్రైవేటు స్థలానికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలన్న గత ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు హైడ్రా కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ సుధాకర్‌రెడ్డి(Sudhakar Reddy) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబరు 31న విచారించిన కోర్టు, కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో నవంబరు 27న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కమిషనర్ మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, 5న హాజరుకావాలని ధర్మాసనం సూచించింది. ఈ క్రమంలో, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్వరూప్ ఊరెళ్ల వాదనలు వినిపిస్తూ, కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువును హైడ్రా తవ్వగా, చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉండడంతోనే బండ్ నిర్మించినట్టు కోర్టుకు వివరణ ఇచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జస్టిస్ మౌసమీ భట్టాచార్య(Justice Mousami Bhattacharya), జస్టిస్ మధుసూదన్ రావు(Justice Madhusudhan Rao) లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.

