Telangana Agriculture: తెలంగాణలో అగ్రికల్చర్ రైజింగ్
Telangana Agriculture ( image Credit: twitter)
Telangana News, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana Agriculture: తెలంగాణలో అగ్రికల్చర్ రైజింగ్.. రైతు సంక్షేమానికి రూ.లక్ష కోట్లకు మించి ఖర్చు!

Telangana Agriculture: వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో పంజాబ్‌‌ను తెలంగాణ దాటేసింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువలో వ్యవసాయం వాటా 6.7 శాతం పెరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగం వాటా గతేడాది రూ.1,00,004 కోట్లు నమోదవగా 2024 – 25 అంచనాల ప్రకారం రూ.1,06,708 కోట్లకు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2023 – 24 సీజన్‌లో 209.62 లక్షల ఎకరాల్లో అన్ని పంటలు సాగు చేయగా 296.17 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది.


2024 – 25 సీజన్‌లో సాగు విస్తీర్ణం ఏకంగా 220.77 లక్షల ఎకరాలకు పెరిగింది. దిగుబడి 320.62 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. తెలంగాణలో ప్రధాన పంట అయిన వరి 2023 – 24లో 118.11 లక్ష్లల ఎకరాల్లో సాగు చేశారు. 2024 – 25లో అది 127.03 లక్షల ఎకరాలకు పెరిగింది. ధాన్యం దిగుబడి 260.88 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి ఈ ఏడాది వానాకాలం, యాసంగిలో కలిపి 284.16 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. పత్తి సాగు విస్తీర్ణం ఇంచుమించుగా రెండేండ్లు ఒకే తీరుగా ఉన్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి కప్పాల ఉత్పత్తి 3.89 లక్షల టన్నులు పెరిగింది. 26.35 లక్షల టన్నుల నుంచి 30.24 లక్షల టన్నులకు చేరింది.

తెలంగాణ రైజింగ్

రాష్ట్ర రైతులను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలనే సంకల్పంతో ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. రూ.54,280 కోట్లతో వివిధ పథకాలను అమలు చేసింది. దాని ఫలితమే దేశంలోనే వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నది. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేసింది. 25 లక్షల (25,35,964) రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది. తొలి ఏడాదిలోనే రూ.20,616 కోట్ల రుణాలను మాఫీ చేసింది.


రూ.10,444 కోట్లు సబ్సిడీ

రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు ప్రతి ఏడాది దాదాపు రూ.10,444 కోట్లు సబ్సిడీగా చెల్లించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతులకు పంటల పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా పంపిణీలోనూ ప్రభుత్వం‌‌ రికార్డ్ నమోదు చేసింది. ఎకరానికి రూ.12 వేల చొప్పున రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ భరోసా నిధులు పంపిణీ చేసింది. మొత్తం 1,57,51,000 ఎకరాలకు 69,86,548 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నిధులు జమ చేసింది. ఈ ఏడాది వానాకాలం పంటలకు రికార్డ్ వేగంతో రైతు భరోసా నిధులు పంపిణీ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా కేవలం 9 రోజుల్లోనే రూ.8744 కోట్లు జమ చేసింది.

Also Read: Agriculture Officer: మహబూబాబాద్ ఏవో నిర్లక్ష్యమే.. రైతులకు యూరియా కష్టాలు!

రైతుకు అండగా ప్రజా ప్రభుత్వం

రైతులకు ఆపద వస్తే వారి కుటుంబాలు ధీమాగా ఉండేలా బీమాను ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా రైతులు ఏ కారణంతో మరణించినా రూ.5 లక్షల బీమా పరిహారం ఆ బాధిత కుటుంబానికి అందిస్తున్నది. 42.16 లక్షల మంది రైతుల కుటుంబాల పేరిట ప్రభుత్వం జీవిత బీమా కంపెనీకి ప్రీమియం చెల్లిస్తున్నది. గతంలో ఒక్కో రైతుకు రూ.3,400 చొప్పున చెల్లించిన ప్రీమియంను ప్రభుత్వం ఎల్ఐసీతో సంప్రదింపులు చేసి ఈసారి రూ.3,225 కు తగ్గించింది. ప్రకృతి విపత్తులతో, క్రిమి కీటకాలతో పంటలు నష్టపోతే రైతులు ఇబ్బంది పడకుండా పరిహారం అందేలా బీమాను పునరుద్ధరించింది. వ్యవసాయానికి సంబంధించి గత ప్రభుత్వం నిలిపేసిన 16 కేంద్ర ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ సర్కార్ పునరుద్ధరించింది.

38.72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

ధాన్యం కొనుగోళ్లపైనా ఫోకస్ పెంచింది. ప్రస్తుత సీజన్‌లో 8,380 కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటికే 38.72 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటివరకు (డిసెంబర్ 2వ తేదీ) దాదాపు రూ.10,162 కోట్ల ధాన్యం కొనుగోలు చేసింది. సెంటర్లలో ధాన్యం అమ్మిన రైతులకు రెండు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నది. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజా ప్రభుత్వం సన్న వడ్లకు రూ.500 బోనస్ కూడా ఇస్తు్న్నది. దీంతో రాష్ట్రంలో సన్నరకాల వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈ సీజన్‌లో ఇప్పటికే సన్నాలు అమ్మిన రైతులకు రూ.314 కోట్ల బోనస్ చెల్లించింది. గత ఏడాది మార్చి, సెప్టెంబర్‌లో వడగండ్లు, వర్షాలతో నష్టపోయిన 94,462 మంది రైతులకు రూ.95.39 కోట్ల పరిహారం అందించింది. ఇటీవల మార్చి, ఏప్రిల్‌లో వచ్చిన భారీ వర్షాలకు నష్టపోయిన 36,449 మంది రైతులకు రూ.44.19 కోట్ల పరిహారం అందించింది. అందుకే త్వరలో నిర్వహించబోయే గ్లోబల్ సమ్మిట్‌లో వీటన్నింటినీ వివరించాలని నిర్ణయించింది.

Also Read: KTR: బీఆర్ఎస్ కు సర్పంచ్ ఎన్నికల టాస్క్?.. సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్

Just In

01

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన

Realme Smart Phone: రియల్‌మీ P4x 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. మరి, ఇంత చీపా?

Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..

Putin’s Aurus Senat Car: భారత్‌లో పుతిన్ పర్యటన.. అందరి కళ్లు ఆ కారు పైనే.. వామ్మో ఇన్ని ప్రత్యేకతలా?

Sathupalli: అర్బన్ పార్క్‌లో దుప్పుల వేట.. అటవీ శాఖ దర్యాప్తు పెరుగుతున్న అనుమానాలు.. కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎవరో?