MLC Balmoor Venkat: హుజూరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తన వంతుగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని ఎమ్మెల్సీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. ఇల్లంతకుంట పర్యటన లో భాగంగా హుజూరాబాద్ చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నూతన సర్పంచులను ఆయన శాలువాలతో సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
30కి పైగా స్థానాల్లో అభ్యర్థులు విజయం
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని 107 గ్రామ పంచాయతీల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో 30కి పైగా స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించడం హుజూరాబాద్ రాజకీయాల్లో వస్తున్న పెను మార్పుకు నిదర్శనమని పేర్కొన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చి, నేడు శాసనమండలి సభ్యునిగా ఈ స్థాయిలో నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు. అందుకే తన ఎమ్మెల్సీ నిధుల్లో సింహభాగం, అంటే సుమారు 80 శాతం నిధులను కేవలం హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నానని ప్రకటించారు. ఈ నిధులను కొత్తగా ఎన్నికైన సర్పంచుల ద్వారానే ఖర్చు చేసి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని భారీ హామీ ఇచ్చారు.
Also Read: Balmoor Venkat : పదేళ్లు నిరుద్యోగులకు అన్యాయం చేసింది ఎవరు?
ప్రజలకు అందుబాటులో ఉంటాం
నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందేలా చూడటంతో పాటు, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF), ఎల్ఓసి (LOC) వంటి అత్యవసర సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అనైతిక పొత్తు పెట్టుకున్నాయని, అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ సిద్ధాంతాల వైపే నిలిచారని వెంకట్ ధీమా వ్యక్తం చేశారు. కేవలం తమ పార్టీ మద్దతుదారులే కాకుండా, గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు.
ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, గెలిచిన సర్పంచులు ఏ పార్టీ వారైనా సరే, గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అందరికీ సమానంగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులందరూ కలిసికట్టుగా ఉండి హుజూరాబాద్‌ను రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీలు కేవలం ఎన్నికల సమయంలో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయని, ప్రజల మేలు కోరే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. ఒక ఎమ్మెల్సీగా మాత్రమే కాకుండా, ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటి సభ్యునిగా ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని, హుజూరాబాద్ ప్రగతికి అండగా ఉంటానని ఆయన మాట ఇచ్చారు.
Also Read: Balmoor Venkat: కేటీఆర్ జైలుకు వెళ్లక తప్పదు.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సంచలన కామెంట్స్

