Gadwal District: గ్రామ పంచాయతీ ఎన్నికల మోజు తీరే.. కొన్నిచోట్ల స్వల్ప, అత్యధిక ఓట్ల తేడాతో ఓటమితో అప్పులు మిగిలే అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థులు మనోవేదనకు గురవుతున్నారు. గ్రామంలో కొంత పలుకుబడి పేరు ఉన్న వ్యక్తులను దశాబ్దాలుగా పార్టీలో పని చేస్తున్న నాయకులను, కుల పెద్దలను ఆయా పార్టీల నేతలు ఎన్నికల బరిలోకి దింపారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఎక్కడికో వెళ్లారు. ఇదే మంచి అవకాశం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎదుగుతావు, నీకు పార్టీలో మంచి పేరు ఉంది అంటూ వారిని పొగడీ పోటీకి ఉసిగోల్పారు. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో మూడు విడతలలో జరిగిన ఎన్నికలలో నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు అభ్యర్థులు చేసిన అప్పులు ఇప్పుడు వారి మెడకు చుట్టుకున్నాయి.
అప్పుల ఊబిలో అభ్యర్థులు
గెలుస్తామని ధీమాతో సర్పంచ్ అభ్యర్థులు ఉన్నది ఖర్చు చేసి అందిన కాడికి అప్పు చేశారు. రిజర్వేషన్ల పుణ్యమా అంటూ కొందరు ఆ పదవిపై ఆలోచన లేకున్నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని ఉద్దేశంతో ప్రచారం కోసం స్టిరాస్తులను కొందరు అమ్ముకోగా మరికొందరు తాకట్టు పెట్టారు. ఎన్నికల ఓటమి చెందగానే చేసిన అప్పులు గుర్తుకొచ్చి ఆందోళనకు గురవుతున్నారు. తమ శక్తికి మించి ఎన్నికల్లో మందు, నగదు పంపిణీకి పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన అభ్యర్థులు పరాజయం చెందడంతో ఆ కుటుంబాలకు ఎన్నికల అప్పులు భారంగా మారాయి.
Also Read: Maoists Surrender: అజ్ఞాతంలో ఉన్నవారు జన జీవనంలోకి రండి.. మావోయిస్టులకు డీజీపీ శివధర్ రెడ్డి సూచన
పోటాపోటీగా ఖర్చు
ఓ మోస్తారు జనాభా ఉన్న గ్రామపంచాయతీలోనే రూ 20 నుంచి 50 లక్షల పైన ఖర్చు చేయడం, గెలుపు కోసం సర్పంచ్ ఎన్నికల్లో పరిస్థితులు ఏ విధంగా దాపురించాయో అర్థం అవుతుంది. అనుచరులు ఆయా పార్టీల కార్యకర్తలు పలువురు చోట నాయకులు గెలుపుకు అవకాశాలు ఉన్నాయని పేరుతో ముందుకు తోయడంతో వారు సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. పోలింగ్ కు ముందు రోజు రాత్రి ప్రత్యర్థులు మందు, విందు పార్టీలతో పాటు, వివిధ రకాల వస్తువులు,నాన్ వెజ్ ఇతర ప్యాకేజీలను ఇచ్చారు. ఒక్క ఓటు కూడా మిస్ కావద్దనే పట్టుదలతో వ్యూహాలు రచించారు. డిమాండ్ ఉన్న పంచాయతీల్లో ఒక్కో ఓటుకు 2 వేల నుంచి 5 వేల వరకు ఇచ్చారు. మేజర్ గ్రామపంచాయతీలలో ఖర్చు కోటి రూపాయలు దాటడం గమనార్హం. ఒక్కోచోట ఇద్దరు ముగ్గురు బరిలో ఉండడంతో పోటీ తీవ్రంగా మారింది. దీంతో ఓటర్ల మనసులను గెలుచుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది.
అనుచరుల మాటలు నమ్మి ఓటమి బాధలో
అన్న ఎన్నికల్లో నువ్వే గెలుస్తావు.. ఖర్చుకు వెనకడకండి అంటూ పెద్ద ఎత్తున వారి అనుచర్లతో గాలి ప్రచారం కొన్నిచోట చేశారు. ఇది నమ్మిన అభ్యర్థులు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్తోమతకు మించి ఖర్చు పెట్టారు. లక్షల్లో, కోట్లలో అప్పులు తెచ్చారు. అప్పులు ఇప్పించే మధ్యవర్తులు అభ్యర్థుల ఆస్తులను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఓవైపు ఓటమి వెక్కిరిస్తుండగా మరోవైపు అప్పులు భయపెట్టిస్తున్నాయి. ఓటమిపాలైన సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తెచ్చిన అప్పులకు నెలనెలా వడ్డీలేలా కట్టాలి. అసలు అప్పు తీర్చేదెలా అనే మీమాంసలో ఓడిన అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.
కరువైన నేతల పలకరింపులు
ఓటమిపాలైన అభ్యర్థులను ఆయా పార్టీల ముఖ్య నేతలు కనీసం పలకరించకపోవడం వారిని మరింత కలవరపెడుతోంది భారీ మొత్తంలో ఖర్చు పెట్టుకుని బరిలో నిలిచి ఓటమిని చూసిన అభ్యర్థులకు సొంత పార్టీ ముఖ్య నేతల నుంచి కనీస ఓదార్పు లేకపోవడం మరింత ఆవేదన కలిగిస్తోంది కోట్లు ఖర్చు చేసిన అభ్యర్థులు తెచ్చిన అప్పులను రాజకీయ భవిష్యత్తును తలుచుకుంటూ ఆవేదన చెందుతున్నారు. మరికొందరు నాయకులు గెలిచిన అభ్యర్థులు సంతోషంలో తమ ఎమ్మెల్యేను ఎమ్మెల్సీలను కలుస్తుండగా ఓడిన అభ్యర్థులు సైతం స్థానిక అధికార పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ ఇతర పదవులపై పనులపై భరోసాను పొందే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read: Narayanpet District: నారాయణపేట జిల్లాలో.. సర్పంచ్ ప్రమాణ స్వీకారంపై లీగల్ సెల్‌లో ఫిర్యాదు..?

